TDP vs YSRCP: తాడిపత్రి రాజకీయ రంగం మళ్లీ వేడెక్కింది.. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటాపోటీ కార్యక్రమాలతో మరోసారి హీట్ పెంచింది.. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం మరోసారి రాజకీయ వేడిని చవి చూస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టగా, అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా ప్రత్యామ్నాయ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలో కాకుండా ఇతర మండలంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయంపై పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి – పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు సూచన మేరకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమ కార్యక్రమాన్ని యాడికి మండల కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రజా ఉద్యమం నిర్వహిస్తూ, “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణం ఆపాలి” అని డిమాండ్ చేశారు. అయితే, యాడికిలో కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు కొంతసేపు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే, తాడిపత్రి రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీ కొత్తకాదు. అయితే, తాజా పరిణామాలతో మళ్లీ రెండు వర్గాల మధ్య రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరినట్టు అయ్యింది..