Kethireddy Venkatarami Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం కొనసాగుతోంది.. నిన్నటికి నిన్నే సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు.. ఇక, మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ తరుణంలో.. మరికొందరు నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. పార్టీలో కీలకంగా ఉన్న నేతలు సైతం.. వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది.. అందులో భాగంగా.. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. అయితే, పార్టీ మార్పు ప్రచారంపై సోషియల్ మీడియా వేదికగా స్పందించారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..
Read Also: Jani Master: జానీ మాస్టర్‌ను హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు.. రహస్య ప్రదేశంలో విచారణ!
తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు వైసీపీ నేత కేతిరెడ్డి. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నామని.. ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని పేర్కొన్నారు కేతిరెడ్డి. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంటే ఉంటానంటూ క్లారిటీ ఇచ్చారు.. ఎల్లవేళలా జగన్ కుటుంబానికి తోడుగా ఉంటాం. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులే బయటకు వెళ్లారు.. కానీ, మా ప్రయాణం మాత్రం జగన్‌తోనే అన్నారు.. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు.. నన్ను నమ్ముకున్న వారి కోసమే రాజకీయాలు చేస్తున్నాను అంటూ స్పష్టం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.