PVN Madhav: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఐక్యత ఇలాగే వర్ధిల్లుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక, ఆర్దిక సమానత్వం సాధించడానికి పెట్టిన పథకాలివి.. కేవలం సూపర్ సిక్స్ లే కాదు, చాలా సిక్స్ లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొట్టిందన్నారు.. పోలవరం, అమరావతికి నిధులను కేంద్రం విడుదల చేసింది.. వేగంగా ఈ ప్రాజెక్టులు నిర్మితం అవుతున్నాయన్నారు.. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తై కృష్ణా బేసిన్ కు, రాయలసీమకు 215 టీఎంసీల నీరు ఇచ్చేందుకు ఆస్కారం కలుగుతుందన్నారు.. త్వరలోనే ప్రజా రాజధాని అమరావతి పూర్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్ కూడా మరింత ప్రగతి సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
డబుల్ ఇంజన్ సర్కారు హయాంలో ఏడాదిలో 9.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు మాధవ్.. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తోంది, అలాగే సెమీ కండక్టర్ యూనిట్ ను కూడా ఇటీవలే కేంద్రం కేటాయించింది.. లక్ష 30 వేల కోట్ల విలువైన 59 జాతీయ రహదారి ప్రాజెక్టులు ఏపీలో నిర్మితం అవుతాయి.. పోర్టులు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయి.. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపే వివిధ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు.. ఇక, జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయదారులకు, మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారులకు లబ్ధి కలగబోతోంది.. వెయ్యికి పైగా వస్తువుల ధరలు తగ్గి గేమ్‌ఛేంజర్‌గా మారబోతోందని వెల్లడించారు..
Read Also: YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక, స్వదేశీ వస్తువులు కొనుగోలు చేస్తే దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది.. ఆ లక్ష్యం దిశగా రాష్ట్రం కూడా ప్రయాణిస్తోందన్నారు మాధవ్.. సూపర్ సిక్స్- సూపర్ హిట్ ప్రతీ ఇంటికి వెలుగు ఇచ్చే పథకాలు. ఈ పథకాల విజయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ సత్తాను చూపిందన్నారు.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. మాతృభాషను కూడా తీసేసే ప్రయత్నం చేసింది.. కూటమి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తోంది. మాతృభాషను కొనసాగిస్తోందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.