వ్యవసాయ రంగంపై పలు సంచలన ప్రశ్నలు సంధిస్తూ.. సీఎం జగన్‌కు నారా లోకేష్ రాసిన లేఖతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల ఆరోప – ప్రత్యారోపణలు రోజురోజుకీ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కొద్దిసేపటి క్రితమే లోకేష్ ఏమైనా వ్యవసాయ రంగ నిపుణుడా? లేక హరిత విప్లవ పితామహుడా? అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సెటైర్లు వేయగా.. తాజాగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీపై విరుచుకుపడ్డారు.
తమ హయాంలో టీడీపీ ఏం చేసిందో ప్రజలకు తెలుసని, ఇప్పుడు కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే టీడీపీ నేతలు రకరకాల పేర్లతో కార్యక్రమాలకు తెరతీస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారని ఆనం ఎద్దేవా చేశారు. ఒకవేళ టీడీపీ నిజంగా అభివృద్ధి చేసి.. రాష్ట్ర ప్రజలు వైసీపీని 151 సీట్లతో గెలిపించేవారా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప, స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీకే పట్టం కట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా సంక్షేమం అందిస్తోందని.. టీడీపీ చేస్తోన్న కార్యక్రమాల వల్ల వైసీపీకి, ప్రభుత్వానికీ ఎలాంటి నష్టం వాటిల్లదని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.