Site icon NTV Telugu

Minister Narayana : అమరావతి పునర్నిర్మాణంలో మరో ముందడుగు

Narayana

Narayana

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించి ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు.

రాజధానిలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, 103.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ భవనాల టెండర్లకు అథారిటీ పచ్చజెండా ఊపింది. ఈ కేంద్రం అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక చిత్రపటంలో నిలబెట్టనుంది. వీటితో పాటు, రాజధానిలో నివసించే అఖిల భారత సర్వీసు అధికారులు (IAS, IPS) , గౌరవ న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణ పనుల కోసం 109.52 కోట్ల రూపాయల మంజూరుకు అథారిటీ ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఏపీసీఆర్డీఏ , అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ADCL) పాలనా వ్యయాలకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సీఎం సమీక్షించారు.

Sharath Kumar : విజయ్‌ రాజకీయ నాయకుడే కాదు.. హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు!

భవిష్యత్తులో అమరావతిలో వర్షం కురిసినా ఎక్కడా నీరు నిలవకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా పకడ్బందీ ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాజధానిలో భారీ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం, జోన్-8లో ఎల్పీఎస్ (LPS) పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. భారీ వర్షాలను సైతం తట్టుకునేలా నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అలాగే, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న యోగా , నేచురోపతి సెంటర్ కోసం భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.

రాజధాని ప్రాంత రైతుల చిరకాల కోరిక అయిన జరీబు , మెట్ట భూముల వర్గీకరణ సమస్యపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ వర్గీకరణలో నెలకొన్న సందిగ్ధతను తొలగించి, రైతులకు న్యాయం చేసేందుకు ఒక రాష్ట్ర స్థాయి కమిటీని నియమించాలని అథారిటీ నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భూముల విలువ , కేటాయింపులపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొని, రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తీర్మానించారు.

108MP కెమెరా, Snapdragon 6 Gen 3తో భారత్‌లో REDMI Note 15 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే..?

Exit mobile version