Andhra Pradesh: కూటమి ప్రభుత్వం అడ్డూఅదుపు లేకుండా అప్పులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. విజన్ అంటే అప్పులు చేయడమేనా అని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బాండ్స్ అమ్మి 5750 కోట్ల అప్పు తీసుకోబోతున్నారని చెప్పారు. సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు తప్పుడు ప్రచారం చేశాయని మండిపడుతున్నారు. తమ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పు 7లక్షల 21వేల 918 కోట్లు అని కూటమి ప్రభుత్వం తేల్చిందన్నారు. అందులో 3,90,247 కోట్లు అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య చేసిన అప్పు అన్నారాయన. అంటే తమ ప్రభుత్వం చేసిన అప్పు 3 లక్షల కోట్ల చిల్లర మాత్రమేనన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆరు నెలలలోనే ఏకంగా రూ.లక్షా12వేల 750 కోట్ల అప్పులతో రికార్డులకెక్కిందని విమర్శించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఫ్రాడ్ చూడలేదన్నారు. తెచ్చిన అప్పు మీద శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. 40ఏళ్ల చరిత్ర, 70 ఏళ్లకు పైగా వయసున్న చంద్రబాబు ఎందుకు ఫ్రాడ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు… ప్రశ్నించడం మానేసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారన్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Sarpanch Election: సర్పంచ్గా మామపై గెలిచిన కోడలు.. ఎన్ని ఓట్ల తేడానో తెలుసా..?
సంపద సృష్టిస్తామని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. 18 నెలల్లో 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు కూటమి ప్రభుత్వం చేసిందన్నారు. కానీ దేనికెంత ఖర్చు చేశారో పాలకులు, అధికారులు చెప్పట్లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ మరో శ్రీలంక, బంగ్లాదేశ్‌లో మారిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్…ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. ఆరోగ్యాంధ్రను అప్పుల ఆంధ్రాగా మార్చేశారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతున్నా… ప్రభుత్వం నుంచి, అధికారంలో ఉన్న పార్టీల నుంచి ప్రతిస్పందన కరువైంది. మంత్రులు ఏమీ పట్టనట్టు ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక అంశాలపై వైసీపీ విమర్శలు చేస్తుంటే తమకేమీ పట్టనట్టు కూటమి నేతల తీరు ఉంది. కనీసం ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితిలో కూడా కూటమి నేతలు లేరు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల పనితీరులో మార్పు రావడం లేదు. అన్నింటికీ సీఎం వచ్చి సమాధానాలు చెప్పాలా..? ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంటే… మంత్రులు చూస్తూ కూర్చుంటున్నారు. కనీసం కౌంటర్ ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది.