YS Jagan Governor Meeting: తమ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమబాట పట్టింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అనేక రూపాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే జనం నుంచి కోటికిపైగా సంతకాల సేకరించింది వైసీపీ. వీటిని గవర్నర్‌కి సమర్పించి పీపీపీ మోడల్‌ను అడ్డుకోవాలని కోరబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గవర్నర్‌కు కోటి సంతకాలు ఇవాళ సమర్పించబోతున్నారు.
Read Also: Murdered Women: యూపీలో దారుణం.. వివాహిత హత్య.. భర్తపై పోలీసుల అనుమానం
ఇవాళ గవర్నర్‌ను కలిసి ప్రజల అభిప్రాయాన్ని వివరించనున్నారు. సంతకాల పత్రాలు నిండిన వాహనాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపనున్నారు జగన్. వాహనాలు పంపిన అనంతరం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, సీనియర్ నాయకులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు కోటి సంతకాల ప్రతులతో గవర్నర్‌ను కలిసి పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరనున్నారు వైసీపీ అధినేత.
ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో మంజూరు చేశారు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెడికల్ కాలేజీల కాన్సెప్ట్ మారిపోయింది. నిధుల కొరత, సమర్ధ నిర్వహణ పేరుతో కాలేజీలన్నింటినీ పీపీపీ మోడల్‌లో నిర్మించాలని నిర్ణయించి టెండర్లు కూడా పిలిచింది. పేద ప్రజలకు వైద్యంతోపాటు వైద్య విద్య అందుబాటులోకి తేడానికి తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ దగ్గరకు జగన్ వెళ్లారు. అక్కడి మెడికల్ కాలేజీని పరిశీలించిన జగన్, ప్రభుత్వం అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అక్కడి నుంచే సమరశంఖం పూరించారు. ఉద్యమం క్రమంగా విస్తరించింది. మొదట గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు, అనంతరం మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. స్టూడెంట్, యూత్ వింగ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, కాలేజీల సందర్శనలు చేపట్టగా, జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు కొనసాగాయి.