YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా ఉంది. కూటమి పార్టీలు, వైసీపీ పోటాపోటీగా జనంలోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం ఏర్పాటు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి ప్రభుత్వంపై పోరాటం విషయంలో నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్.
Read Also: AP Government: ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు.. ఇది కూటమి ప్రభుత్వ విజయం..
గతవారం జగన్ పల్నాడు పర్యటన రాజకీయ దుమారానికి కారణమైంది. పర్యటన సూపర్ సక్సెస్ కావటం. ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావటం. వైసీపీ శ్రేణులు, అభిమానులు పోటెత్తటంతో రోడ్లు కిక్కిరిశాయి. పోలీసుల ఆంక్షలను నేతలు ధిక్కరించడం. మరోవైపు కార్యకర్తలు వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రదర్శించటం, కాన్వాయ్‌లోని వాహనం సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం రచ్చకు కారణమయ్యాయి. వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రదర్శించిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. జగన్ వాహనమే ఢీకొని సింగయ్య మృతి చెందాడని కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో జగన్‌ను A-2గా చేర్చడంతో వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీపైనా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లతో జగన్ సమావేశం నిర్వహించనుండటం హాట్ టాపిక్ మారింది.
Read Also: DGCA : దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో ‘సర్వేలెన్స్’..
ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు జగన్. ఇప్పటికే పలు దఫాలుగా వైసీపీ పీఏసీ సభ్యులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు ఆర్గనైజ్ చేశారు. ఈ మధ్య వరుసగా చోటు చేసకుంటున్న పరిణామాలు, వైసీపీ నేతల అరెస్టులు, పొదిలి, సత్తెనపల్లి పర్యటనల్లో నమోదు చేసిన కేసులు, కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలు లాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి కావటంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేతలను సమాయత్తం చేయనున్నారు జగన్. సమస్యలపై ప్రాంతాలవారీగా ఆందోళన నిర్వహణ, జిల్లా స్థాయిలోనూ పోరు బాట నిర్వహించేలా కార్యచరణ రూపొందించనున్నారు. అయితే ఇప్పటిదాకా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో జగన్ నేరుగా పాల్గొనలేదు. ఇకపై మాత్రం నిరసన కార్యకరమాల్లో జగన్ పాల్గొని… కూటమి విమర్శలను తిప్పికొట్టే అవకాశం ఉందంటున్నారు. రేపటి మీటింగ్‌లో నేతలకు జగన్ ఏం చెప్పబోతున్నారు..? కేసులపై ఆ పార్టీ నేతల స్పందన ఏంటనేది చూడాలి.
