Site icon NTV Telugu

YS Jagan: కూటమి ప్రభుత్వానికి హైప్ ఎక్కువ.. పనితీరు తక్కువ.. గణాంకాలు బయటపెట్టిన జగన్..

Ys Jagan Press Meet

Ys Jagan Press Meet

YS Jagan: “హైప్ ఎక్కువ.. పనితీరు తక్కువ” అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి హైప్ తప్ప పనితీరు లేదని ఆరోపిస్తూ, ఆర్థిక గణాంకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని ఎక్స్ (X) వేదికగా గణాంకాలు బయటపెట్టారు.. చంద్రబాబు విజన్ గురించి పెద్దగా ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవ పనితీరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందని చెబుతూ, కృత్రిమ GSDP గణాంకాలతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న భ్రమను ప్రభుత్వం సృష్టిస్తోందని ఆరోపించారు.

Read Also: Balakrishna – Harish Shankar: గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో గాడ్ ఆఫ్ మాసెస్ సినిమా..! టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్ లోడింగ్?

ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 శాతంగా, జాతీయ వృద్ధి 9.8 శాతంగా ఉందని ప్రకటించిందని జగన్ గుర్తు చేశారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75 శాతం, జాతీయ వృద్ధి 8 శాతం మాత్రమేనని అంచనా వేస్తోందని తెలిపారు. 2023–24, 2024–25 రెండేళ్ల కాలానికి కలిపి రాష్ట్ర GSDP CAGR 11.09 శాతమని ప్రభుత్వం చెబుతోందని, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందన్న ప్రచారం జరుగుతోందని అన్నారు. అయితే ఈ గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ విడుదల చేసినవి కావని, పూర్తిగా చంద్రబాబు కార్యాలయం తయారు చేసినవేనని జగన్ ఆరోపించారు. నిజంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంతగా ఉంటే, అదే స్థాయిలో ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరగాలని స్పష్టం చేశారు.

CAG విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత రెండేళ్లలో రాష్ట్ర పన్ను ఆదాయాల వృద్ధి CAGR కేవలం 1.97 శాతం మాత్రమేనని జగన్ తెలిపారు. 11.09 శాతం GSDP వృద్ధి చూపుతూ, పన్ను ఆదాయాలు కేవలం 1.97 శాతం మాత్రమే పెరగడం ఆర్థిక నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఇది కృత్రిమ గణాంకాల వల్లే సాధ్యమని విమర్శించారు జగన్‌.. ఈ ఆర్థిక సంవత్సరపు తొలి 9 నెలల గణాంకాలను CAG 23 రాష్ట్రాలకు విడుదల చేయగా, పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో నిలిచిందని చెప్పారు. అంటే కింద నుంచి రెండో స్థానంలో ఉందని వివరించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64 శాతం పెరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 1.97 శాతం మాత్రమే పెరిగాయని పేర్కొన్నారు.

అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఆర్థిక పనితీరు కేంద్రాన్ని మించిందని ప్రభుత్వం చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని వైఎస్‌ జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్న అంశాలు ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు, తప్పుడు ప్రచారం మాత్రమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..

Exit mobile version