YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు

Ys Jagan Press Meet

Ys Jagan Press Meet

YS Jagan: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ నాయకులతో చర్చించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీ విజయాలు, ఓటింగ్ శాతాలు, ఎన్నికల నిర్వహణలో జరిగినట్లు భావిస్తున్న అక్రమాలపై నాయకులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పార్టీ కేడర్ మొత్తం ఎంతో కసితో, పట్టుదలతో ఎన్నికల్లో పోరాటం చేసిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజలంతా చూశారని, వాస్తవాలను ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం పెరిగిందని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు చోటుచేసుకున్నప్పటికీ వైసీపీ ఓటింగ్ శాతం పెరగడం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగి ఉంటే వైసీపీకి మరింత భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యేదని జగన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలు బయటపడితే తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే భయంతోనే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి చంద్రబాబు సరికొత్త విధానాలను ప్రవేశపెట్టారని విమర్శించారు. అన్ని అడ్డంకులను అధిగమించి వైసీపీ విజయం సాధించిన చోట కూడా అక్రమాలకు పాల్పడి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారని, లేని విషయాలను సృష్టించి అబద్ధాలు ప్రచారం చేశారని జగన్ విమర్శించారు. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇన్ని దుర్మార్గాలకు పాల్పడిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలు ఎప్పుడూ చూడలేదు..
జగన్‌ను కలిసిన వివిధ జిల్లాల నాయకులు తమ రాజకీయ జీవితాల్లో ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులుగా బౌన్సర్లను ఏర్పాటు చేసి లెక్కింపు ప్రక్రియను నిర్వహించారని నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల బంధువులను కిడ్నాప్ చేసి నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్ల పేరుతో పెద్ద సంఖ్యలో వైసీపీ ఓట్లను తొలగించారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులు గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్ నిర్వహించి లెక్కల్లో మార్పులు చేశారని, అయితే వైసీపీ నేతలు కోరిన చోట మాత్రం రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించలేదని నాయకులు వెల్లడించారు. అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్ పేపర్లు అందించి, ఆ పార్టీ అభ్యర్థులు గెలిచేలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

గ్రామగ్రామాన చంద్రబాబు బాధితులు ఉన్నారు..
ఈ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేయించిన దాడుల కారణంగా రాష్ట్రంలోని గ్రామగ్రామాన బాధితులు ఉన్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని జగన్‌కు వివరించారు. ఎన్నికల షెడ్యూల్ నుంచి ఫలితాల ప్రకటన వరకు జరిగిన పరిణామాలను పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, అక్రమాలపై పార్టీ నాయకులతో చర్చించిన జగన్.. పార్టీ శ్రేణులు ధైర్యంగా పోరాటం చేశాయని పేర్కొన్నారు.