NTV Telugu Site icon

Sand Mafia: ఉచిత ఇసుకపై మాఫియా కన్ను.. ఆ చిన్న అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని..!

Sand Policy

Sand Policy

Sand Mafia: ఏపీ ప్రభుత్వం వినియోగదారులందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొచ్చింది.. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది.. అయితే.. ప్రభుత్వం ప్రకటించిందో లేదో, సాండ్ మాఫియా మాత్రం తమ బుర్రలకు పదును పెట్టే పనిలో పడింది.. ప్రభుత్వం ఒక్కొక్క వినియోగదారుడికి రోజుకు 20 మెట్రిక్ టన్నులు ఇసుక తీసుకెళ్లడానికి అనుమతినిచ్చింది.. దీనికోసం ఉచితంగా ఇసుక తీసుకువెళ్లే వినియోగదారుడు, ఆధార్ కార్డు నెంబరు సబ్మిట్ చేసి.. డిజిటల్ పేమెంట్ విధానంలో ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఇసుక తీసుకువెళ్లాలి.. ఈ ఒక్క నిబంధన తప్ప ఇతర నిబంధనలు ఏవి ప్రభుత్వం పెట్టలేదు.. వినియోగదారులు తీసుకెళుతున్న ఇసుక ఎందుకోసం తీసుకెళ్తున్నాడు ? నిర్మాణాలు చేస్తున్నారా? ఏ నిర్మాణాల కోసం ఉపయోగిస్తున్నారు? అనేటువంటి విషయాలు ఏమి ప్రభుత్వం అడగడం లేదు. దీంతో, ఎప్పటినుంచో ఇసుక మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సాండ్ మాఫియా.. తమ బుర్రకు పదును పెట్టింది.. వాస్తవానికి గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని, భవన నిర్మాణాలు చేసే వారి సంఖ్య పదులు, లేదా వందల సంఖ్యలో మాత్రమే ఉంటుంది.. మిగతా వారంతా ఇసుకతో పెద్దగా పని లేనివారే.. ఈ చిన్న అంశాన్ని ఇసుక మాఫియా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది.

Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్, విన్ ఫాస్ట్ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు..!

గ్రామాల్లో గృహ నిర్మాణాలు చేసే వారు ఎలాగూ ఇసుక తీసుకెళ్తారు.. ఇక మిగతావారు ఖాళీగా ఉంటారు కాబట్టి, వాళ్ల పేర్లతో ఉన్న ఆధార్ కార్డులు సబ్మిట్ చేసి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే అమౌంట్ వేసి డిజిటల్ పేమెంట్ చేస్తే, ఎంచక్కా ఇసుకను తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లో విక్రయించవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు ఇసుక మాఫియా గ్యాంగులు.. ఆలోచన కాదు ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.. గ్రామాల్లో ఉన్న అమాయక ప్రజల నుండి ఆధార్ కార్డులు సేకరించి, వారికి అంతో ఇంతో ఇస్తామని నమ్మించి, ఆధార్ కార్డులు డిజిటల్ పేమెంట్ తో సహా ఇసుక రీచ్ లకు తీసుకువెళ్లి ఇసుక కొనుగోలు చేస్తున్నారట.. ఎటు తిరిగి ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది, డిజిటల్ పేమెంట్ కూడా అమాయక ప్రజలు చేస్తారు కాబట్టి , తీసుకువెళ్తున్న ఇసుకకు స్టాండ్ మాఫియా కు ఎలాంటి సంబంధం లేనట్లుగా కనిపిస్తుంది. ఇసుక ఎవరు తీసుకెళ్తున్నారు ? అనే విషయం ఎందుకు తీసుకెళ్తున్నారు అనే విషయం , ఇసుక స్టాక్ పాయింట్ లో గాని, డంపింగ్ పాయింట్ లో గాని అధికారులు అడగరు.. కాబట్టి యధేచ్ఛగా తమ అక్రమ ఇసుక వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు ఇసుక మాఫియా గ్యాంగులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి విషయాలు మీద దృష్టి పెట్టి, నిజమైన వినియోగదారులకు ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ వస్తుంది.. మరి చూడాలి ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది , ఇసుక మాఫియాను ఎలా డీల్ చేస్తారో రాబోయే రోజుల్లో ఇసుక మాఫియాని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెడుతుందో చూడాలి.