Sajjala Ramakrishna Reddy: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలచిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు. మండల స్థాయిలో కూడా పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా నిరసన కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది.. అయితే, ప్రభుత్వం కొన్ని చోట్ల కార్యక్రమాన్ని అడ్డుకుంటే దానికి తగిన విధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగించాలని సజ్జల పేర్కొన్నారు.
Read Also: Chennai Love Story : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్, గ్లింప్స్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి..
ఇక, ఎక్కడైనా అడ్డంకులు కల్పిస్తే న్యాయస్థానాల ద్వారా అధిగమిద్దాం అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల తెలిపారు. ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేస్తాం అన్నారు. అణిచివేసే ప్రయత్నం చేస్తే మీడియాలో వివరిద్దాం.. సీనియర్ నాయకుల సమన్వయం ఉంటుంది, వారంతా అందుబాటులో ఉంటారు అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయితేనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా అర్ధమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైనా ఆపే ప్రయత్నం చేస్తే ఎక్కడ నిలువరిస్తే అక్కడే మీడియాతో మాట్లాడి వివరిద్దాం.. మనం ప్రభుత్వంతో ఘర్షణ పడడానికి కాదు, ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపడుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
