Palla Srinivasa Rao: కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తిస్థాయి సన్నద్ధంగా ఉన్నారన్న ఆయన.. ఇందులో ఎటువంటి అనుమానము ఎవరికి అవసరం లేదు. వైసీపీ అరాచకాలకు తెరదించుతూ ఈ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంటే తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా మదనపడిపోతుందని ఫైర్ అయ్యారు.
Read Also: Surya : సూర్య – వెంకీ అట్లూరి కాంబోలో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ.. ?
ఇక, ఏదోరకంగా అడ్డంకులు కలిగించేందుకు పసలేని ఆరోపణలు చేస్తోంది అని విమర్శించారు పల్లా శ్రీనివాసరావు.. అందుకే ఎంపీ అవినాష్ రెడ్డి సేవ్ డెమోక్రసీ అంటూ గగ్గోలు పెడుతూ దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి కుయుక్తులన్నీ ప్రజలు పసిగట్టారు. వీరి అరాచకాలకు భరతం పట్టేరీతిన తీర్పును ఇవ్వనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చే దిశగా తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఒంటిమిట్ట సీతారామ చంద్రుల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఉన్నాయి. ఒంటిమిట్ట ,పులివెందుల రెండు జడ్పీటీసీ స్థానాలు కూటమి ఖాతాలో చేరబోతున్నాయి. ఈ రెండు ప్రాదేశిక నియోజక వర్గాల ఓటర్లు తమ విస్పష్ట తీర్పును ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. వారందరికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇదే మా శుభాభినందనలు. కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రజలు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నాను అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు పల్లా శ్రీనివాసరావు..
