NDA Meeting Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ఎన్డీఏ పార్టీల కీలక సమావేశం అమరావతిలో జరిగింది. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలు, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అలాగే ‘సర్’ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రానికి లభించే నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి, ఒక స్థానం జనసేన పార్టీకి దక్కే అవకాశాలపై నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.
అలాగే ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’ ప్రక్రియపై కూడా కూటమి ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిగింది. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాలపై ఎమ్మెల్యేలు స్పష్టమైన అవగాహనతో ప్రజల్లోకి వెళ్లేలా అవగాహనా తరగతులు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాల ద్వారా ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టి సారించనున్నారు.
ఇక కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలనే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే దిశగా కూడా నేతలు ఆలోచించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల పాలనలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
