Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: వినాయక చవితి రోజు ప్రతిష్టించిన బొజ్జ గణపయ్య విగ్రహాలను సంబరాలతో సాగనంపుతున్నారు భక్తులు.. అయితే, డీజే వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం.. వాహనాన్ని సీజ్‌ చేసిన ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీకి విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్.. నిమజ్జనానికి డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ తనకు పలువురు సందేశాలు పంపుతున్నారని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత, డీజీపీ జోక్యం చేసుకుని డీజే వాహనాలకు అవసరమైన అనుమతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు. నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి, వేగంగా క్లియరెన్స్‌లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక్క డీజే వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేయకూడదని లోకేష్ పోలీసు శాఖను కోరారు. ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకునేలా అధికారులు సహకరించాలని ఆయన తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. లోకేష్ తన ఎక్స్‌ పోస్టులో హోంమంత్రి అనిత, డీజీపీని ట్యాగ్ చేస్తూ ఈ విజ్ఞప్తి చేశారు. దీనిపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. డీజే అనుమతుల దరఖాస్తులను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలించి అనుమతులు ఇచ్చేలా పోలీసు శాఖకు అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు.