Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ఇక, జనసేన పోటీ.. టికెట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తారని తెలిపిన ఆయన.. రాజకీయాల్లో పాఠాలు ఉండవని, అనుభవమే పాఠమని ఆయన అన్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య చిన్నచిన్న ఇబ్బందులు తలెత్తినా తొందరపడి మాట్లాడకుండా సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో బలపడాలని మనోహర్ సూచించారు. గతంలో జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన మూడు చోట్ల విజయం సాధించిందని, మరో ఏడు చోట్ల రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. కేవలం టికెట్ వస్తే గెలుస్తామనే ఆలోచనలను పక్కన పెట్టాలని, ప్రజలు అభ్యర్థులు, పార్టీల పనితీరును నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు.
కూటమి భాగస్వామ్యం వల్లే రాష్ట్రం ఈ స్థాయికి చేరుకోగలిగిందని.. మూడు పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయని మనోహర్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఆలోచనలను కొంతమంది నాయకులు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదని, అయితే పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలు ఆయన ఆలోచనలను బలంగా అర్థం చేసుకున్నారని చెప్పారు. గత పాలకులు అధికారంలోకి వస్తే భూములను దోపిడీ చేయవచ్చనే ఆలోచనతో వ్యవహరించారని ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రజలు అలాంటి విధానాలను తిరస్కరించారని అన్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
సీట్ల కేటాయింపుపై స్పష్టత రావాల్సి ఉందని మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఖరారు కాలేదని, సమన్వయ కమిటీ స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాయిలో జరుగుతుందని తెలిపారు. టికెట్లు ఎవరికి వస్తాయన్నది పార్టీ అధ్యక్షుడి తుది నిర్ణయమని, అంతకుముందు జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జనసేన పార్టీ గతంలోనూ సీట్ల సర్దుబాటుపై పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే తుది అని స్పష్టం చేసింది.
120 సీట్లలో పోటీ చేస్తే గెలుస్తామనే ధోరణి వద్దని మనోహర్ అన్నారు. పోటీ చేసే సీట్ల సంఖ్య కంటే, గెలిచే బలం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయడమే ముఖ్యమని చెప్పారు. పార్టీ ఆలోచనలు, విధానాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడిదారులకు భరోసా కల్పించడంలో విజయవంతమైందని, ఉత్తరాంధ్రకు వస్తున్న భారీ పెట్టుబడులు అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. జనసేన పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడలేదని, ప్రజల కోసం పుట్టిందని మనోహర్ అన్నారు. పార్టీలో గ్రూపులు లేవని, పవన్ కల్యాణ్ నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఏదైనా పొరపాటు లేదా సమస్య కనిపిస్తే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇక, వార్డుల వారీగా నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని, పార్టీ అండగా నిలుస్తుందని మనోహర్ తెలిపారు. సమిష్టి నాయకత్వంతో ముందుకు వెళ్తామని, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించే లక్ష్యంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల సంఖ్యపై కాకుండా, గెలిచే సామర్థ్యం ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేయాలని జనసేన ఇప్పటికే తన కమిటీలకు సూచించిందని తెలిపారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్..

