రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్.. 2024-25 సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో 5 నెలల కాలానికి గాను నవంబర్‌లో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కాగా.. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 28న సభ ముందుకు బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏపీ బడ్జెట్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.
Read Also: United Nations: బంగ్లాదేశ్ నిరసనల్లో 1400 మంది మృతి.. ఐక్యరాజ్యసమితి వెల్లడి..
కాగా.. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉంది. ఇప్పటికే శాఖల వారీగా ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరాలు తీసుకుంటున్నారు. మరోవైపు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఇప్పటికే కేంద్రానికి వివరించి.. ఆర్ధిక సాయం కోరారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఉచిత ఇసుక వంటి పాలసీతో ఆదాయం వదులుకుంది ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్లు పెంపు చేశారు. పింఛన్ల పై సరాసరి నెలకు రూ. 2720 కోట్లు వెచ్చిస్తుంది ప్రభుత్వం. దీనికి తోడు.. దీపం 2, అన్న క్యాంటీన్లు వంటి పథకాలు ప్రారంభించింది.
Read Also: IND vs ENG 3rd ODI: భారత్ భారీ స్కోరు.. సెంచరీతో చెలరేగిన గిల్
మరోవైపు ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు వంటి పథకాలకు ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ కూర్పు సవాల్‌గా మారింది. అటు పథకాలు, ఇటు అభివృద్ది కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే.. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంతో కొంత ఊరట లభించినట్లైంది. అయితే.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రత్యేక సాయం అదించాలని సీఎం చంద్రబాబు 16వ అర్థిక సంఘాన్ని కోరారు. కాగా.. సంక్షేమం ఇస్తూ, అభివృద్ది పనులను కొనసాగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో.. బడ్జెట్ కూర్పుపై విస్తృత కసరత్తు చేస్తుంది ఏపీ సర్కార్.