DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు

Dsc Candidates

Dsc Candidates

DSC Candidates: డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. నియామకాల్లో చోటుచేసుకున్న లోపాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి తమ గోడును వినిపించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించినప్పటికీ తమకు ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలు, మెరిట్ ఉన్నప్పటికీ పోస్టులు ఇవ్వకుండా తమను పక్కన పెట్టారని ఆరోపించారు. మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

తమ సమస్యలను పలుమార్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్పందన లభించలేదని చెప్పారు. మంత్రి కార్యాలయం చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా తమ బాధలను పట్టించుకోలేదని వాపోయారు. విద్యాశాఖ అధికారుల నుంచి కూడా సరైన సమాధానాలు రాలేదని తెలిపారు. 1:1 విధానంలో కాల్ లెటర్లు జారీ చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ప్రశ్నలు లేవనెత్తారు. ఒక పోస్టుకు ఒకరినే పిలిచిన తర్వాత కూడా నియామకం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎందుకు పిలిచారని నిలదీశారు.

×
×
Ad

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తమ పేర్లు ఎంపికైన వారి జాబితాలోనూ లేవని, తిరస్కరించిన వారి జాబితాలోనూ లేవని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే సంబంధిత కార్యాలయాల నుంచి తమను బయటకు పంపించారని ఆరోపించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తమలాంటి అభ్యర్థులకు ఈ ప్రక్రియ వల్ల తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. క్రీడా కోటా పేరుతో ఎంపికైన కొందరికి బోధనా అంశాలతో సంబంధం లేని సర్టిఫికెట్లు ఉన్నాయని, అలాంటి వారు విద్యార్థులకు పాఠాలు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారికి క్రీడల సంబంధిత పోస్టులు ఇస్తే అభ్యంతరం లేదని, కానీ ఇతర సబ్జెక్టుల బోధన బాధ్యతలు అప్పగించడం విద్యా వ్యవస్థకు నష్టమని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురిచేస్తున్నారని వాపోయారు. ప్రజాస్వామ్యంలో తమ బాధలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు. డీఎస్సీ మెరిట్ లిస్టులను పలుమార్లు మార్చారని, కటాఫ్ మార్కులు కూడా ప్రకటించలేదని అభ్యర్థులు ఆరోపించారు. విడుదల చేసిన మెరిట్ లిస్టులను కొద్ది రోజుల్లోనే వెబ్‌సైట్ నుంచి తొలగించారని చెప్పారు. డీఎస్సీ పేరుతో నిర్వహించిన నియామకాల్లో జిల్లాల వారీగా జాబితాలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

తమ సమస్యలను ఓపికగా విని ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 1998 డీఎస్సీలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు కూడా ఆయన అండగా నిలిచారని గుర్తుచేశారు. తమలాంటి సాధారణ అభ్యర్థులు పెద్ద పెద్ద కోర్టుల్లో న్యాయపోరాటం చేయడం ఆర్థికంగా సాధ్యం కాదని, అందుకే తమకు న్యాయం జరిగేలా సహకరించాలని జగన్‌ను కోరారు డీఎస్సీ అభ్యర్థులు..