Site icon NTV Telugu

Cyclone Fengal: తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్..

Cyclone Fengal

Cyclone Fengal

Cyclone Fengal: ఫెంగల్‌ తుఫాన్‌ తీరాన్ని తాకింది.. పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాన్‌ తీరం తాకిన తర్వాత.. మహాబలిపురం-కరైకల్‌ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది.. దాదాపు 4 గంటల్లో తీరం దాటే ప్రక్రియ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఈ రోజు రాత్రి 11.30 గంటల సమయానికి.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.. ప్రధానంగా తమిళనాడుకు సరిహద్దు ప్రాంతాల్లో వర్షపు జోరు కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కుడుస్తుండడంతో జనజీవనానికి అంతరాయం కలుగుతుంది.. వాగులు.. వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. స్వర్ణముఖి.. కాలంగి.. కైవల్యా నదులతో పాటూ బొగ్గేరు.. బీరా పేరు.. పంబలేరులలో నీటి ప్రవాహం పెరిగింది. కాలంగినది నీరు పులికాట్ కు చేరుతుండడంతో సరస్సు జలకళను సంతరించుకుంటోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

Read Also: Scissors In Abdomen: మహిళ కడుపులో కత్తెర.. చూసి షాకైన డాక్టర్లు

ఇక, ఫెంగల్‌ తుఫాన్‌ దెబ్బకు అల్లాడిపోతోంది డెల్టా… ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లలో ప్రభావం చూపిస్తోంది తుఫాన్.. డెల్టా ప్రాంతంలోని తెనాలి, బాపట్ల డివిజన్లతో పాటు, గుంటూరు డివిజన్‌లో వర్షాలు కురుస్తున్నాయి.. డెల్టా ప్రాంతంలో అనేక చోట్ల నేలకొరిగాయి వరి పంట.. నవంబర్ మాసంలో వచ్చే తుఫాన్లు డెల్టా ప్రాంతానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయని, ఆందోళన చెందుతున్నారు రైతులు.. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటలకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది..

Exit mobile version