CM Chandrababu: భారీ వర్షాలు, వరదలు.. కృష్ణా నదిలో వరద ఉధృతితో.. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, వరుసగా వర్షాలు, వరదలపై సమీక్షలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అవకాశం దొరికినప్పుడల్లా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్తున్నారు.. ఈ రోజు రెండు గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు.. రామలింగేశ్వర నగర్, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగగా.. సహాయక చర్యలను పరిశీలించారు.. ఆహారం అందుతుందా..? లేదా..? అనే అంశంపై ఆరా తీశారు.. రెండు గంటల పర్యటన అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలక్టరేట్ కు చేరుకున్న చంద్రబాబు… కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
రెండు గంటల పాటు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు.. తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం.. గత ప్రభుత్వం జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. బాధితులకు సహాయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వీడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పని తీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని.. కానీ, చెడ్డపేరు తెచ్చేలా ఉంటే మాత్రం ఊరుకునేది లేదంటా వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.