NTV Telugu Site icon

CM Chandrababu: మీడియా చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Cbn

Cbn

CM Chandrababu: పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వినతులు ఎన్ని ఉన్నా… అన్నింటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నాయన.. గత ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోంది. రికార్డులు కూడా తారుమారు చేశారు. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రతీ జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణగా పేర్కొన్నారు.

Read Also: Heart transplant: ‘‘ఆ గుండె వేగం ఎంతంటే 13 నిమిషాల్లో 18 కి.మీ.’’..

అయితే, 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్న ఆయన.. ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారు. కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా వేటికవి విభజించి పరిష్కరిస్తాం అన్నారు.. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకూ రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా యంత్రాంగం రూపొందిస్తున్నాం అన్నారు.. జిల్లాల్లో నా పర్యటనల సందర్భంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తాం. పోలీసు వ్యవస్థ సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థగా మారుస్తామని స్పష్టం చేశారు. వర్షాలు పడి ప్రాజెక్టులు కూడా నిండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. శాఖల వారీ సమీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాగా, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈ రోజు ఉదయం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు, పార్టీ శ్రేణుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇక, సీఎంను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.