Site icon NTV Telugu

CM Chandrababu: ప్రధాని మోడీకి కృతజ్ఞతాపూర్వక స్వాగతం..

Cbn Modi

Cbn Modi

CM Chandrababu: అమరావతి రీలాంచ్ కు సర్వం సిద్ధమైంది.. రాజధాని పనుల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభకు అంతా రెడీ అయింది. రాజధాని పనుల్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. రూ.58 వేల కోట్లకు పైగా పనులకు శ్రీకారం చుడతారు. పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి సూచికగా 20 అడుగుల ఎత్తైన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఇక, సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్‌ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని మోడీకి వివరించేందుకు… మెయిన్ డయాస్ వెనకవైపు అమరావతి పెవిలియన్‌ ఏర్పాటు చేశారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇక, రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్వాగతం పలికారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Vinay Narwal: ముస్లింలపై నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని #Amaravati నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది.. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది.. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుంది.. ఇందుకు సహకరిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నాను..” అంటూ తన ట్వీట్‌తో ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు..

Read Also: Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!

కాగా, అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం రూ.1,07,002 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. రూ.49,040 కోట్ల రాజధాని పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు రూ.57,962 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్‌ పద్ధతిలో మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న విషయం విదితమే..

Exit mobile version