CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చగా.. ఆ వెంటనే మురుసు తుఫాన్ ముసురుకుంది.. అయితే, మురసు తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. 45 వేల మందికి పైగా అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. గత వారం రోజులుగా అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో నిరంతరాయంగా సేవలందిస్తున్న అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు. ముఖ్యంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం పనిచేస్తున్న సిబ్బంది సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపడుతున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. మురసు తుఫాను ప్రభావంతో రేపటి వరకు వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలం
గత 24 గంటల్లో బాపట్లలో 20 సెంటీమీటర్లు, నాగులుప్పలపాడులో 20, కొత్తపట్నంలో 18, త్రోవగుంటలో 17, చీరాలలో 17, నర్సాపురంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి పల్నాడు జిల్లా యడ్లపాడులో 25 సెంటీమీటర్లు, మద్దిపాడులో 24, చిలకలూరిపేటలో 22, నాదెండ్లలో 22, గన్నవరంలో 21, చిగురుమామిళ్లలో 21 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వెల్లడించారు. బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని పేర్కొన్న సీఎం.. రేపు ఉదయం వరకు అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కోనసీమ నుంచి నెల్లూరు వరకు వివిధ జిల్లాల్లో మురసు తుఫాను వర్ష ప్రభావంపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ముంపు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.. వరద ప్రవాహాలపై హెచ్చరిక
వర్షాల ప్రభావం, ముంపు ప్రాంతాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని చంద్రబాబు సూచించారు. గుంటూరు, పల్నాడు సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహాలు దిగువన ఉన్న బాపట్ల జిల్లాకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని సూచించారు. పల్నాడు జిల్లాలోని యడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల తదితర ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ తరహాలో భారీ వర్షం కురిసిందని ఆ జిల్లా కలెక్టర్ సీఎంకు వివరించారు. పర్చూరు వాగు నుంచి వరద ప్రవాహాలు సముద్రంలోకి వెళ్తున్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ తెలిపారు.
రేపు సాయంత్రంలోగా బాధితులకు సాయం అందించాలి
వర్షాలు తగ్గేంత వరకు కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను బాధితులకు అందించాల్సిన సహాయాన్ని రేపు సాయంత్రంలోగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

