CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్‌

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు నామినేషన్లు వేసుకోవాలని చెబుతున్నప్పటికీ, వైసీపీ నేతలు దాడులు చేసి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, రాష్ట్రపతి పాలన రావాలనే ధోరణితో వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడు పనిచేస్తున్నాడని వ్యాఖ్యానిస్తూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

జగన్‌ బెంగళూరు నుంచి వచ్చి మూడు రోజుల పాటు ప్రెస్‌మీట్లు పెట్టి తిరిగి వెళ్లిపోతారని చంద్రబాబు అన్నారు. అసత్యాలను వందసార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగమని, తాను గత 50 సంవత్సరాలుగా ఎన్నికల ప్రక్రియను గమనిస్తున్నానని తెలిపారు. కాలక్రమేణా ఎన్నికల సంస్కరణల్లో అనేక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్నికల నిర్వహణను ఒక అధికారి పర్యవేక్షించేవారని, ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను నియమించే స్థాయికి వ్యవస్థ అభివృద్ధి చెందిందని వివరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తమ తీర్పును ఎన్నికల ద్వారా వెల్లడిస్తారని అన్నారు చంద్రబాబు.

గత పదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారిందని చంద్రబాబు విమర్శించారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లాయని వ్యాఖ్యానించారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం బాహ్య శక్తుల నుంచి ఎదురయ్యేదని, ఇప్పుడు రాజకీయ వ్యవస్థ నుంచే సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ నాయకులే నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇలాంటి పరిణామాల వల్ల కొన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని పేర్కొన్నారు. గతంలో ఫ్యాక్షన్‌ సమస్య కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేదని గుర్తుచేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రాంతంలో ఫ్యాక్షన్‌ ఉన్నప్పటికీ, ఆయన బయటకు వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించేవారని వ్యాఖ్యానించారు. మంచి ప్రభుత్వాల ద్వారానే సుపరిపాలన సాధ్యమవుతుందని అన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందకపోవడానికి ఫ్యాక్షనిజం ప్రధాన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు.

గత ఏడు దశాబ్దాలుగా శాంతిభద్రతల సమస్యలు రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టాయని చంద్రబాబు అన్నారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్‌ ఆర్డర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించానని తెలిపారు. ఈ క్రమంలోనే తిరుమలలో తనపై దాడి జరిగిందని గుర్తుచేశారు. కొత్తకొత్త సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2019 నాటికి రాష్ట్రంలో పరిస్థితులు పరాకాష్టకు చేరాయని చంద్రబాబు ఆరోపించారు. ఆ సమయంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని, విధ్వంసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..