Botsa Satyanarayana: శాసనసభలో డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను అమలు చేసిన ప్రభుత్వం, అదే విధానాన్ని శాసనమండలిలో ఎందుకు అమలు చేయలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక, దేవదేవుడి ప్రసాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనవసర ఆరోపణలు చేశారని బొత్స ఆరోపించారు. పందికొవ్వు, జంతువుల కొవ్వు కలిపారని ప్రచారం చేయడం బాధాకరమన్నారు. వాస్తవాలు తేలాలని సుప్రీంకోర్టు సిట్ నియమించిందని, దర్యాప్తులో కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. ప్రజలు జీర్ణించుకోలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Read Also: Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్.. స్పందించిన బ్యూటీ!
కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారనే కారణంతో ఇందాపూర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని, ఇప్పుడు అదే సంస్థ రూ.680కు నెయ్యి సరఫరా చేస్తోందని తెలిపారు. ఇందాపూర్ సంస్థకు హెరిటేజ్ ఫుడ్స్ సంబంధం ఉందని, ఇవన్నీ తాము సృష్టించిన ఆరోపణలు కాదని — సంబంధిత సంస్థలే వెల్లడించాయని అన్నారు. ఇందాపూర్‌ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ దోపిడీకి ప్లాన్ చేసిందని, దేవుడి పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో ఇందాపూర్ అంశంపై చర్చకు ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. టాయిలెట్లలో వాడే కెమికల్స్ లడ్డూలో కలిపారని సీఎం మాట్లాడటం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు అధికార దాహంతో ఏ స్థాయికైనా వెళ్తారని విమర్శించారు. ఆయన దోపిడీపై ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు.
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో బిల్ గేట్స్ పేరు కేంద్రం తొలగించిందనే వార్తలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని, ఆ తర్వాత స్పందిస్తామని తెలిపారు. ఒకవేళ కేంద్రం ఆయన పేరును పక్కన పెట్టి ఉంటే, అదే సమయంలో ఏపీకి ఆహ్వానించడం సబబు కాదన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇంటింటికీ వైద్యం అందించామని, ఈ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలంటే తీసుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తానికి, అసెంబ్లీలో అమలు చేస్తున్న డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని మండలిలో కూడా అమలు చేయాలని బొత్స సత్యనారాయణ గట్టిగా డిమాండ్ చేశారు.