Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అర్నబ్ తుఫాన్ దూసుకొస్తుంది.. దీనికి ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.. అర్నబ్ తుఫాన్ తీరానికి సమీపంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాబోయే 12 గంటలు కీలకమని, తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోనూ రేపు ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చని అంచనా వేశారు.
ఈదురుగాలుల ముప్పు కూడా పొంచి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గంటకు 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పూరిళ్లు, రేకుల షెడ్లలో నివసించే వారు ఎలాంటి ప్రమాదం జరగకుండా వెంటనే సమీపంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని స్పష్టం చేసింది. తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు వేగంగా పరిష్కారం పొందేందుకు ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009ను సంప్రదించాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం అవసరమైన వారు విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101కు ఫోన్ చేయాలని తెలిపారు. తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.

