Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు దూసుకొస్తుంది.. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది.. అందులో భాగంగా.. రేపు, ఎల్లుండి అంటే మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని విద్యాసంస్థలకు మంగళవారం, బుధవారం అధికారులు సెలవులు ప్రకటించారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
ఇక, అర్నబ్ తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్న 80 వేలు మందిని అప్రమత్తం చేశారు.. వారికోసం ప్రత్యేకంగా 101 కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు… తీర ప్రాంతంలో ఉన్న ఆరు మండలాల తో పాటు, మరో ఐదు మండలాలలో భారీ వర్షాలు ఈదురు గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు… ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రద్దు చేశారు కలెక్టర్..
అయితే, అర్నాబ్ తుఫాను కారణంగా కోనసీమ, కాకినాడ జిల్లాలకు పెనుముప్పు పొంచి ఉంది… సముద్రం అల్లకల్లోలంగా మారింది .. ఇప్పటికే తీరం దగ్గర అలలు ఉధృతి పెరిగింది.. ఇక, తుఫాన్ తీరం దాటే సమయంలో 2.5 మీటర్ల ఎత్తున ఉప్పెన సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది.. గరిష్టంగా 140 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.. ఈ సమయంలో కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని అధికారులు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. కాకినాడ జిల్లాకి ఒక ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు..

