APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదైన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. ఈ అక్రమాల్లో మరింత మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్సార్, ఏ2గా క్యామ్ సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో ఏపీపీఎస్సీ కమిషన్ వింగ్ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్రను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ చెప్పిన పనులను వెంకట సుబ్బయ్య చక్కబెట్టినట్టు గుర్తించారు. ప్రస్తుతం వెంకట సుబ్బయ్య అందుబాటులో లేరు. కేసు నమోదు చేయాలని ఫిర్యాదు వచ్చిన గత నెల 22నే వెంకట సుబ్బయ్య అమెరికా వెళ్లారు ఈ నెల 22 వరకు సెలవులో ఉన్నారు.. దీంతో వెంకట సుబ్బయ్య వచ్చాక నోటీసులు ఇవ్వటం లేక అరెస్టు చేస్తారని సమాచారం.
Read Also: Off The Record: ఈటల రాజేందర్ పూర్తిగా మారిపోయారా..?
మరోవైపు కేసులో మూల్యాంకనం చేసిన సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అర్హత లేకపోయినా మూల్యాంకనం చేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారని సమాచారం.. ఇప్పటికే కొందరిని విచారణ కూడా చేశారు. ఇందులో సతీశ్ అనే ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ సూసైడ్ ప్రయత్నం చేసుకోవటం కూడా కలకలం రేపింది. మరోవైపు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ పాత్ర తేల్చాలని బయో డైవర్శిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ డిమాండ్ చేయటం చర్చగా మారింది. అక్రమాల వ్యవహారంలో గౌతం సవాంగ్ పాత్ర ఉందని ఆయన ఆరోపించటం ఇప్పుడు చర్చగా మారింది. ఇప్పటి వరకు కేసు విచారణ పురోగతిని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుతో విచారణ అధికారిగా ఉన్న నందిగామ డీఎస్పీ తిలక్ నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.
