AP SEC Meeting: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.. తాజాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలతో అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమావేశం నిర్వహించింది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా, కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు..
ముఖ్యంగా ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశం అమలుపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల అంశాన్ని కూడా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది ఎన్నికల సంఘం..
మరోవైపు, నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువును రెండు రోజుల పాటు పొడిగించాలని, అభ్యర్థుల జాబితా ప్రచురణను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని, స్వేచ్ఛగా నామినేషన్లు వేసేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, అభ్యర్థులందరికీ పోలీసులు, అధికారులు సమాన అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను కఠినంగా పర్యవేక్షించాలని, జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలును అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చూస్తూ కూర్చోలేదని, న్యాయసమీక్షాధికారం కింద ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నామని పేర్కొంది. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ న్యాయస్థానాలు అవసరమైన ఆదేశాలు ఇస్తాయని స్పష్టం చేసింది. ఇక, వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల గడువు పొడిగింపు, అభ్యర్థుల జాబితా ప్రచురణ తదితర అంశాలపై ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

