AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!

Ap Municipal Election Resul

Ap Municipal Election Resul

AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ అధికారిక కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,020 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం టీడీపీ 600కు పైగా వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, జనసేన 26, వైసీపీ 21, బీజేపీ 13 వార్డుల్లో ముందంజలో ఉన్నాయి.

ఇక, మున్సిపాలిటీల్లోనూ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. పుంగనూరు, పెనుకొండ మున్సిపాలిటీలను టీడీపీ సొంతం చేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకోగా, ఆ పార్టీ అభ్యర్థి ఎం. ఈశ్వర్ మున్సిపల్ చైర్మన్‌గా విజయం సాధించారు. పిఠాపురంలోనూ జనసేన అభ్యర్థులు మంచి ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రధాన నగరాలైన గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, అనంతపురం కార్పొరేషన్లలోనూ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని 96 వార్డుల్లో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మండపేటలో కూటమి 36 వార్డులను, కొవ్వూరులో 27 వార్డులను కైవసం చేసుకుంది.

వినుకొండ మున్సిపాలిటీలోనూ కూటమి విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ 14, బీజేపీ 2, జనసేన ఒక స్థానంలో గెలుపొందగా, వైసీపీ ఒక వార్డును దక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డుల కౌంటింగ్ పూర్తయింది. ఇందులో టీడీపీ 15, జనసేన 4 స్థానాలు గెలుచుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాయి. వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు.. వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ పీఠాన్ని కూడా అధికారిక కూటమి కైవసం చేసుకుంది. మరోవైపు జగ్గయ్యపేటలో జనసేన అభ్యర్థి మేఘన ప్రత్యేక విజయాన్ని నమోదు చేశారు. 31వ వార్డులో పోటీ చేసిన ఆమె 540 ఓట్ల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. వాసిరెడ్డి పద్మ కుమార్తె అయిన మేఘన గెలుపు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు మెజారిటీ ప్రాంతాల్లో విజయాలు నమోదు చేస్తుండటంతో టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.