Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్‌బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తూ అద్భుత విజయాలు సాధించిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరు, రవాణా శాఖ సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు వాహన్ యాప్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే సారథి యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్‌ఎల్‌ఆర్‌ల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

గతంలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు మాన్యువల్ విధానంలో జరిగేవని, ప్రస్తుతం ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి 19 రకాల పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి వివరించారు. రోడ్డు భద్రత, సురక్షిత ప్రయాణాల కోసం రవాణా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. ఈ పథకం అమలును 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నామని, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు.

×
×
Ad

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించి 21 రకాల దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుస్తున్నామని తెలిపారు. ఈ పథకాలను ప్రభుత్వం భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. మహిళా ప్రయాణికులకు బస్ స్టాప్‌లు, బస్ స్టేషన్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, ఆర్‌వో ప్లాంట్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

రాబోయే రెండు నెలల్లో 700కు పైగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇకపై డీజిల్ బస్సుల కొనుగోళ్లు చేయబోమని, పర్యావరణ పరిరక్షణ కోసం దశలవారీగా 8,351 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ సౌకర్యంతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 500 సీఎన్‌జీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.