Minister BC Janardhan Reddy: రాయలసీమ అభివృద్ధి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిని ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ రాయలసీమ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. గతంలో కర్నూలు పర్యటనకు వచ్చిన జగన్.. కుందూ నదిని వెడల్పు చేస్తానని హామీ ఇచ్చి, ఆ పనులను తన అనుచరులకు కేటాయించుకుని రాజకీయ లబ్ధి పొందారని మంత్రి ఆరోపించారు. అవుకు టన్నెల్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే.. ఆ క్రెడిట్‌ను కూడా జగన్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. అలాగే, గోరుకల్లు రిజర్వాయర్, గాలేరు–నగరి ప్రాజెక్టు వంటి కీలక నీటి ప్రాజెక్టులను కూడా కూటమి ప్రభుత్వమే పూర్తి చేసిందని, అయినా జగన్ అభివృద్ధిని తమ ఘనతగా చెప్పుకోవడం తగదన్నారు.
జగన్ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా.. వైసీపీ పార్టీ కోసం పనిచేసే రాజకీయ నిరుద్యోగులకు ఆదాయం తెచ్చిపెట్టే వనరులుగా మారాయని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు ఎయిర్‌పోర్టును తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తే, జగన్ తన పాలనలో తన తండ్రి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారని మంత్రి గుర్తుచేశారు. అభివృద్ధి మేము చేస్తే, ప్రచారం మీరు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. వై నాట్ 175 నినాదాన్ని కూడా జగన్ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని.. కానీ, 175 సీట్ల లక్ష్యానికి మద్దతు ఇచ్చింది, 40 నుంచి 11 ఎమ్మెల్యేలకు పరిమితం చేసింది కూడా ప్రజలే కదా? అని అన్నారు.
అసెంబ్లీ సాక్షిగా తేల్చుకుందాం అంటూ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.. నిజంగా రాయలసీమపై ప్రేమ ఉంటే అసెంబ్లీ సాక్షిగా చర్చకు రావాలి.. మీ ఎమ్మెల్యేలను సభకు పంపితే.. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.. చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకంగా చర్చకు రెడీగా ఉంది.. రాజకీయ డ్రామాలు మానుకోవాలి అంటూ జగన్‌కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాయలసీమ అభివృద్ధి అంశాన్ని రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడం తగదని, ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మంత్రులదే అని బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.