AP High Court: అధికారుల నిర్లక్ష్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్ (CRZ) నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతిసమీపంలో కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యులైన అధికారులను రక్షించేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా న్యాయస్థానం వ్యక్తం చేసింది.
Read Also: IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
బాధ్యుల వివరాలను సమర్పించాలని కమిషనర్‌కు రెండు సార్లు ఆదేశాలు ఇచ్చినా స్పందన రాలేదని హైకోర్టు పేర్కొంది. కమిషనర్ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణం జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలోని సీఆర్‌జెడ్-1 ప్రాంతంలో సముద్రానికి అత్యంత సమీపంలో ఈ నిర్మాణం జరుగుతోందని పిటిషనర్ వాదించారు. ఈ వ్యవహారంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
