AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారి, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అహ్మద్ బాబుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగం, ఉద్యోగులను వేధించడం, కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటుగా స్పందించింది. విచారణలో భాగంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “మాకే అధికారం ఉంటే ఈ క్షణాన్నే అహ్మద్ బాబును సస్పెండ్ చేసేవాళ్లం” అంటూ ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాగద్వేషాలు కలిగిన వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగేందుకు అర్హుడు కాదని స్పష్టం చేసింది.
Read Also: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
బీపీసీ నిర్వహించి అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా ఫైళ్లను తొక్కిపెడతారా అని కోర్టు ప్రశ్నించింది. ఇది ఉద్యోగులను వేధించడం కాదా, వారి జీవితాలతో ఆడుకోవడమే కాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులు అన్నా అహ్మద్ బాబుకు గౌరవం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అహ్మద్ బాబుపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించాలని కోర్టు సూచించింది. సరైన ఆధారాలు లభిస్తే ఆయనను డిస్మిస్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వగలమని తెలిపింది.
అలాగే అహ్మద్ బాబు ఇష్టారీతిన వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య కార్యదర్శి ఏమి చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే పదవిలో ఎందుకు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అధికారులను లూప్ లైన్‌లో పెట్టాలని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ వినతిపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
