Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు

Simhachalam Temple Land

Simhachalam Temple Land

Simhachalam Temple Land: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను ప్రైవేటు సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దేవస్థానం భూముల బదిలీకి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా అడవివరం గ్రామంలోని సర్వే నంబర్ 275, ముదసర్లోవ గ్రామంలోని సర్వే నంబర్ 26 పరిధిలో ఉన్న మొత్తం 160 ఎకరాల దేవాదాయ భూమిని వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్‌కు బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

అయితే, ఈ పిల్‌ను విచారించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూమిని ప్రైవేటు సంస్థకు బదిలీ చేయడానికి గల కారణాలు, అనుసరించిన విధివిధానాలపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ సభ్య కార్యదర్శి, రాష్ట్రస్థాయి నిపుణుల అంచనా కమిటీ చైర్మన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (APIIC) మేనేజింగ్ డైరెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అలాగే వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సంబంధిత ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.