Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు

Sai Krishna Lockup Death Ca

Sai Krishna Lockup Death Ca

Sai Krishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. పిటిషన్ ఉపసంహరణకు గల పూర్తి కారణాలను కోర్టుకు వివరించాలని పిటిషనర్ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని ఆదేశించింది.

సాయి కృష్ణ అదృశ్యమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ విజయలక్ష్మి గత నెల 26వ తేదీన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన కుమారుడు లాకప్ డెత్‌కు గురయ్యాడని ఆరోపిస్తూ, ఈ ఘటనపై స్వతంత్రంగా సీబీఐతో విచారణ చేపట్టాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను విజయలక్ష్మి అనూహ్యంగా ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, మొదట సీబీఐ దర్యాప్తును ఎందుకు కోరారు? ఇప్పుడు అదే దర్యాప్తు అవసరం లేదని ఎందుకు భావించారు? అనే అంశాలపై పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కేసును మరుసటి రోజుకు వాయిదా వేయాలని కోరారు. అయితే, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించిన హైకోర్టు, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మరోవైపు.. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. ఏపీ సర్కార్‌ తరఫున దాఖలైన పిటిషన్‌పై స్పందించేందుకు ప్రతివాది, కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజుకు వారం రోజుల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు.. నాగరాజు పోలీస్ కస్టడీకి సంబంధించి హైకోర్టు విధించిన షరతులను సవాల్ చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.. నిందితుడి ట్రాన్సిట్ సమయంలో పూర్తి నిడివి వీడియో రికార్డింగ్ చేయాలని ఏపీ హైకోర్టు పేర్కొంది.. అయితే ఈ షరతులపై ఏపీ ప్రభుత్వం, సిట్ అభ్యంతరం తెలిపింది.. నిరంతర వీడియో నిఘా కారణంగా దర్యాప్తు గోప్యత దెబ్బతినే అవకాశం ఉందని ఏపీ సర్కార్ చెబుతుంది.. ఈ కేసు విచారణకు సంబంధించిన కీలక అంశాలు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం తన పిటిషన్‌లో చెప్పుకొచ్చింది.. అదేవిధంగా సాయికృష్ణ మృతదేహం అన్వేషణ, సంఘటన స్థల పునర్నిర్మాణం (సీన్ రికన్‌స్ట్రక్షన్) వంటి కీలక దర్యాప్తు చర్యలకు హైకోర్టు విధించిన నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని సుప్రీంకోర్టులో వాదించారు సిట్ అధికారులు..