AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అర్నబ్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తోంది ప్రభుత్వం.. ఇక, తుఫాన్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యమని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రేపు ఉదయం తీరం దాటే అవకాశం
ప్రస్తుతం తుఫాన్ గంటకు సుమారు 24 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని చంద్రబాబు వెల్లడించారు. ఒక్కోసారి దాని వేగం తగ్గుతున్నప్పటికీ, గాలుల తీవ్రత పెరుగుతోందని చెప్పారు. రేపు ఉదయం కోనసీమ, యానాం మధ్య కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని, కొన్ని ప్రాంతాల్లో 180 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పెరుగుతున్నాయని, మేఘాలు దట్టంగా ఉండటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. కృష్ణా జిల్లా వరకు గాలులు, వర్షాల ప్రభావం ఉంటుందని, అక్కడి నుంచి పశ్చిమ దిశగా వెళ్లే కొద్దీ వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. కాకినాడలోని ఉప్పాడ తీర ప్రాంతంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. సముద్రతీర, తీర ప్రాంత, లంక గ్రామాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్లాలని సూచించారు.
2,199 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,199 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న 84,396 మందిని ఇప్పటికే ఈ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. తుఫాన్ పరిస్థితులపై ప్రజలకు సమాచారం అందించేందుకు ఇకపై గంటగంటకు బులెటిన్లు విడుదల చేస్తామని చెప్పారు. అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ప్రస్తుతం పెద్దగా ప్రమాదం లేదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటే వెంటనే స్పందించాలని సూచించారు.
NDRF, SDRF బృందాలు సిద్ధం
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలను అందుబాటులో ఉంచినట్లు సీఎం తెలిపారు. వైద్య బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. 108 అంబులెన్స్‌లు, అత్యవసర మందులు, పాముకాటు నివారణ మందులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అవసరమైన చోట్ల జనరేటర్లు, రేషన్ సరుకులు, తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అవసరమైన సామగ్రి, సిబ్బందిని ప్రభావిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 5,153 మంది గర్భిణులను గుర్తించినట్లు చంద్రబాబు తెలిపారు. తుఫాన్ ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. అవసరమైన వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మరోవైపు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాగావళి, వంశధార నదుల నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉందని సీఎం హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
రైతులు, పశువుల రక్షణకు చర్యలు
తుఫాన్ కారణంగా ఉద్యానవన పంటలు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యంగా అరటి, కొబ్బరి సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక, తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తీర ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

