AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే.. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది కేబినెట్..
Read Also: Ponnam Prabhakar: వాహనదారులకు వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ విషయమై ప్రతిపాదన కేబినెట్ ముందుకు రాబోతోంది.. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్ చర్చించనుంది. సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై మంత్రివర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పీ-4 విధానం అమలు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే.. మరోవైపు దేవాలయాల్లో పూజలు సహా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఆయా దేవాలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. దేవదాయ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.. అర్చకులకు విస్తృతాధికారులు కట్టబెట్టింది ఏపీ ప్రభుత్వం.