AP Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి పెట్టుబడుల జాతర.. పలు పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో పాలు కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.. ఈ భేటీలో 30కి పైగా కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, విద్యుత్ ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, భూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ప్రముఖ సంస్థల ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానుండగా, వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

కియా ప్లాంట్‌-2కు ఆమోదం.. 12 వేల మందికి ఉద్యోగాలు
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.19 వేల కోట్ల పెట్టుబడితో కియా ఇండియా రెండో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కియా సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థల పెట్టుబడుల ద్వారా సుమారు 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.1,800 కోట్ల పెట్టుబడితో సెయింట్ గోబెన్ గ్లాస్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమ ద్వారా 150 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో రూ.13,667 కోట్ల పెట్టుబడితో అదానీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్‌కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా 765 మందికి ఉపాధి లభించనుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏటీసీ టైర్ల పరిశ్రమ విస్తరణకు రూ.1,047 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త పరిశ్రమలు
చిత్తూరు జిల్లాలో ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ గార్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.266 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదనకు కేబినెట్‌లో ఆమోదం లభించింది. ఈ పరిశ్రమ ద్వారా 3,103 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అదే జిల్లాలో రూ.228 కోట్ల పెట్టుబడితో న్యూట్రిక్రీమ్స్ ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల 251 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో భవ్య రసాయన్ పథకం కింద గ్రీన్‌ఫీల్డ్ కెమికల్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా విజయపురం మండలంలోని కోసలనగరం ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం రూ.1,500 కోట్ల బ్రిడ్జి లోన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా భూసేకరణ, మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టనున్నారు.

పారిశ్రామిక, డిఫెన్స్ ఏరోస్పేస్ రంగాలకు ప్రోత్సాహం
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ హబ్ అభివృద్ధిలో భాగంగా అవంతి వేర్‌హౌసింగ్ సంస్థకు అదనంగా 30 ఎకరాల భూమి కేటాయించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో డిఫెన్స్ ఏరోస్పేస్ కేంద్రం ఏర్పాటుకు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థకు 86 ఎకరాల భూమి కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఎంఎస్ఎంఈల కోసం రైట్ టు బిజినెస్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు
ఇక, ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో గ్రీన్ వర్క్స్ కోసం రూ.180.68 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వాగులు, కాలువల అభివృద్ధి, పార్కుల నిర్మాణం, అమరావతి మెమోరియల్ పార్క్ ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు. మరోవైపు ఏపీ సచివాలయం, హెచ్‌వోడీ భవనాల నిర్మాణానికి సంబంధించి గతంలో రూ.4,688 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని రూ.6,641 కోట్లకు పెంచే సవరించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు రూ.380 కోట్ల కాంట్రాక్ట్ కేటాయింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. హైకోర్టు భవనంలో విద్యుత్, లిఫ్టులు, ఫైర్ సేఫ్టీ పనుల కోసం రూ.432 కోట్ల ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది.. అమరావతి పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,215 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మొత్తం 14 ప్యాకేజీల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అమరావతి సంగమం నిర్మాణానికి రూ.626 కోట్ల ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. వివిధ శాఖల సమన్వయంతో పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గవర్నెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నారు.

పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం
రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచే దిశగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కడప జిల్లాలో 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు మైలవరం మండలంలో 1,127 ఎకరాల భూమిని 33 ఏళ్ల లీజుకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లాలో 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఎకోరెన్ సంస్థ నుంచి జెంటారి రెన్యూవబుల్స్‌కు బదిలీ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా పొలవరం గ్రామంలో ఆర్‌వీఏఎస్ రీజెన్ సంస్థ 12 టన్నుల సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం జిల్లాలో 119 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు తాడిపత్రి మండలంలో 31.46 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది.

భూ సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతపురం జిల్లాలో 4,352 మంది పట్టాదారులకు ఊరట కలిగించేలా 9,917 ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే రైల్వే కోడూరు మండలంలో 5,324 మంది రైతులకు సంబంధించిన భూ రికార్డుల సవరణకు ఆమోదం తెలిపింది. మొత్తం 10,192 ఎకరాల భూముల్లో అథుకుబడి పట్టాలను జిరాయితీ పట్టాలుగా మార్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయాలతో ఆయా ప్రాంతాల్లోని రైతులు, భూ యజమానులకు ప్రయోజనం కలగనుంది. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశంలో పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పునరుత్పాదక విద్యుత్, భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 30కి పైగా అంశాలకు ఆమోదం తెలపడంతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు ముందుకు సాగనున్నాయి.