Talliki Vandanam Scheme: గుడ్‌న్యూస్‌.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనుంది. విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించడం, తల్లులపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కార్‌..

ఈ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.10,049 కోట్ల నిధులను విడుదల చేసింది. విద్యాశాఖ ఇందుకు అనుమతి ఇవ్వగా, ఈ నెల 24వ తేదీన అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది తల్లులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అలాగే రాష్ట్రంలోని 66.90 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. విద్య కొనసాగిస్తున్న పిల్లల తల్లుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం ద్వారా పారదర్శకతను పాటిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువును కొనసాగించేందుకు, కుటుంబాలకు చేయూత అందించేందుకు ‘తల్లికి వందనం’ పథకం కీలకంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాల విద్యను ప్రోత్సహించడం, డ్రాప్‌ఔట్‌లను తగ్గించడం, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 24వ తేదీన నిధులు జమ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.