Ambati Rambabu: కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పులతో పోలిస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే దాదాపు అదే స్థాయి అప్పులు చేసిందని ఆరోపించారు. జగన్ హయాంలో మొత్తం ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో 18 నెలల్లోనే రూ.3.02 లక్షల కోట్ల అప్పులు చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అంటే జగన్ హయాంలో చేసిన అప్పుల్లో దాదాపు 90 శాతం అప్పులను కేవలం ఏడాదిన్నరలోనే చేశారని అన్నారు. జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన వారు, చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా అంటూ ప్రశ్నించారు.
కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.69 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిందని, 90 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించగలిగామని అంబటి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చినా, కూటమి ప్రభుత్వ హయాంలోనే దాదాపు రూ.20 వేల కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపారని ఆరోపించారు. అలాగే ఎన్నికల హామీలను ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ‘టైగర్ ఆఫ్ మార్షల్’ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన అంబటి, ఆయనకు అనేక సామర్థ్యాలు, కళలు ఉన్నాయని ప్రశంసించారు. అయితే పవన్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జనసేన నేతల నెత్తిన ఎక్కి టీడీపీ నేతలు ఆడుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బెంగుళూరులో ఉంటూ వైఎస్ జగన్.. కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలపై స్పందించిన అంబటి, జగన్‌కు ఇక్కడే శాశ్వత నివాసం ఉందని తెలిపారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ల శాశ్వత నివాసాలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. “మీరు నదీ గర్భంలో ఉన్న ఇంట్లో ఉంటున్నారు” అంటూ విమర్శలు చేశారు. జగన్ ప్రతీ వారం రాష్ట్రానికి వచ్చి ప్రజలతో మమేకమవుతున్నారని తెలిపారు. టీడీపీ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారని, జగన్ మాత్రం స్ట్రెయిట్ పాలిటిక్స్ చేస్తారని అన్నారు. డొంక తిరుగుడు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టం చేశారు. సత్తెనపల్లిలో ఆరేళ్ల పాటు ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించామని, గత ఏడాది కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయామని తెలిపారు. ఈ ఏడాది ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశామని, తమ సంక్రాంతి వేడుకలకు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మరోవైపు.. దైవాన్ని అడ్డం పెట్టుకుని తుచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. జగన్‌ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీ కుట్రలను వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు అంటూ అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.