CM Chandrababu: అరకు వేదికగా గిరిజనులకు శుభవార్త చెప్పార ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అల్లూరి జిల్లా అరకు లోయలో చంద్రబాబు పర్యటించారు. అరకు మండలం గన్నెలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘సంజీవని’ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. సంజీవని ద్వారా ఆదివాసీ కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు ఏపీ సీఎం…
‘సంజీవని’ గేమ్ ఛేంజర్‌గా మారుతుంది
సంజీవని కార్యక్రమం రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చంద్రబాబు అన్నారు. అనారోగ్యం వచ్చినప్పుడు గిరిజనులు విశాఖపట్నం లేదా పాడేరు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఇకపై సాంకేతికతను ఉపయోగించి మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ‘మీ ఆరోగ్యం మీ ఫోన్‌లో ఉంది’ అని సీఎం పేర్కొన్నారు. సంజీవని యాప్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఫోన్‌లోనే తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా తమ ఆరోగ్య వివరాలను ఫోన్ ద్వారా చెక్ చేసుకునే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు.
ప్రతి గిరిజన బిడ్డకు మెరుగైన వైద్యం
ప్రతి గిరిజన కుటుంబానికి, ప్రతి గిరిజన బిడ్డకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు తెలిపారు. గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానంపై గిరిజనుల్లో అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
మూడు నెలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి
ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చంద్రబాబు వెల్లడించారు. మూడు నెలల్లో ఇక్కడ ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామని తెలిపారు. ఏ వైద్య పరీక్ష అవసరమైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని సీఎం చెప్పారు. దీంతో చిన్నచిన్న వైద్య అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు గిరిజనులకు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఏజెన్సీలో సెల్‌టవర్లు.. కనెక్టివిటీ పెంపు
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత సమర్థంగా అందించేందుకు కనెక్టివిటీ కూడా కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మరికొన్ని సెల్‌టవర్లను ఏర్పాటు చేసి మొబైల్ కనెక్టివిటీని పెంచుతామని తెలిపారు. సంజీవని వంటి డిజిటల్ వైద్య సేవలు సమర్థంగా పనిచేయాలంటే కనెక్టివిటీ అవసరమని, అందుకే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సదుపాయాలను మెరుగుపరుస్తామని సీఎం పేర్కొన్నారు.
అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు
అరకు ప్రాంత అభివృద్ధి, గిరిజనుల ఆదాయంపై కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అరకు కాఫీతో పాటు మిరియాల సాగు కూడా ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయని చెప్పారు. గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు వ్యవసాయం, ఉద్యాన పంటలు, స్థానిక ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు సేవలను గుర్తుచేసిన సీఎం
గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను చంద్రబాబు గుర్తుచేశారు. గిరిజనులకు ఆయుర్వేద వైద్యం అందించిన వ్యక్తిగా అల్లూరి సీతారామరాజు సేవలను ప్రస్తావించారు. అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్‌పోర్టుకు పెట్టామని సీఎం తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక, గిరిజనుల ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆరోగ్యం, వైద్యం, కనెక్టివిటీ, ఆదాయ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ‘సంజీవని’ కార్యక్రమంతో గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంతో పాటు, డిజిటల్ టెక్నాలజీని వారి ఆరోగ్య సంరక్షణకు అనుసంధానం చేయడం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవల్లో కొత్త మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

