ఓ వైపు ఏఐతో అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటే సమాజంలో ఇంకా మూఢ విశ్వాలు వీడడం లేదు. సైంటిస్టులకంటే.. బాబాలే ఫేమస్. అరచేతిలో స్వర్గాన్ని చూపించి అందినకాడికి దోచేస్తున్నారు ఫేక్ బాబాలు. అమాయకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు. కాగా గతేడాది మిషన్ అహం బ్రహ్మాస్మీ మోసాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మికత పేరుతో ఆస్తులు దోచేస్తూ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులను లొంగదీసుకుని దూరం చేస్తున్నారని మిషన్ అహం బ్రహ్మస్మీ సంస్థపై కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మరోసారి అహం బ్రహ్మస్మీ మోసాలు వెలుగుచూశాయి.
అహం బ్రహ్మస్మీ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అహం బ్రహ్మాస్మి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ సారి ఆశ్రమంకి వచ్చే యువతీ యువకులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. మాతా శ్రీ సహస్ర తారా విశాల్ అలియాస్ స్వప్న ఆశ్రమంకి వచ్చే యువతీ యువకులకు బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తూ వారిని లొంగదీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన 5 గురుకి వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో దైవ నిర్ణయమని చెప్పి పెళ్ళిళ్ళు జరిపించింది కిలాడీ మాతాశ్రి.
వివాహాల అనంతరం సహస్ర తారా విశాల్ భార్య భర్తలను విడదీసి మహిళలను తన అధీనంలో ఉంచుకుంటోంది. మాతా శ్రీ ట్రాన్స్ లో పడిన ఆ మహిళలు భర్తలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ఆశ్రమంకి డొనేషన్ ల పేరుతో డబ్బులు వసూల్ చేస్తోంది. ఆస్తులను ఆశ్రమంకి రాయలంటూ బోధనలు చేస్తూ బురిడీ కొట్టిస్తోంది. మాతా శ్రీ మోసాలపై బాధితులు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.