Aarogyasri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగుతోంది. దీని వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ మాత్రం చర్చలు జరిగే వరకు ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించబోమని తేల్చి చెప్పారు. ఇక, ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. CFMSలో పెండింగ్‌లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం కష్టమైందని ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది.
Read Also: Keerthy Suresh: ఆ రోల్స్ కోసమే బాలీవుడ్‌కి వచ్చాను..
అయితే, త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ ఇచ్చారు. కానీ, ఈ హామీపై ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు విశ్వాసం చూపకపోగా, సమస్యపై తుది పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఒక సమావేశం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రి సంఘాల నిర్ణయంతో రాష్ట్రంలో పేద ప్రజలు ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్చలు ఎప్పుడు జరుగుతాయో, తిరిగి సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో అని ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.
మరోవైపు, తెలంగాణలో కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలకు బ్రేక్ పడింది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల సమ్మె యథాతథంగా కొనసాగుతుంది. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా నెట్ వర్క్ ఆస్పత్రులు పట్టువీడటం లేదు.. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది.