కొన్నేళ్ల నుంచి ఎయిర్ ఇండియా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సహజంగానే అది అందులో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. జీతాల్లో కోత…చెల్లింపులో ఆలస్యం..ఉద్యోగుల తొలగింపు వంటివి ఎలాగూ ఉంటాయి. వేల కోట్ల అప్పుల భారంతో ఉన్న సంస్థకు ప్రభుత్వం ఇక ఏమాత్రం నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఎయిరిండియా ఉద్యోగులకు ఎప్పుడో అర్థమైంది. దాంతో కొంత కాలంగా వారు భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు.
లక్ష కోట్ల మేర రుణ భారంతో కుంగిపోయిన ఉన్న ఎయిర్ ఇండియా అమ్మకానికి 2018లో గట్టి ప్రయత్నమే జరిగింది. కాని పెట్టబడులు పెట్టేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కథ కూడా అలిటాలియా (ఇటలీ ఎయిర్‌లైన్స్) మాదిరిగానే ముగుస్తుందని కేంద్రం భయపడింది. ఎందుకంటే ఇటలీ దానిని సకాలంలో ప్రైవేటీకరించలేకపోయింది.
ఇప్పుడు ఈ ఎయిర్‌లైన్స్ తిరిగి టాటా గూటికి చేరింది. ప్రస్తుత తరుణంలో రెండు రకాల ఉద్యోగులను ఎయిరిండియాలో చోడొచ్చు. కొత్త యాజమాన్యంలో సరికొత్త భవిష్యత్తును చూసేవారు కొందరైతే, అది కూడా సంస్థను లాభాలబాట పట్టించలేదనే వారు మరికొందరు. వారు ఈ అభిప్రయానికి రావటానికి బలమైన కారణం ఉంది. ఎయిరేషియా ఇండియా, విస్తారా విమానయాన సంస్థలకు కూడా టాటా సన్స్‌కు చెందినవే. ఈ రెండు ఎయిర్‌లైన్స్ ద్వారా దశాబ్దం క్రితం టాటా గ్రూపు తిరిగి విమానయాన రంగంలో అడుగు పెట్టింది. కానీ సాధంచింది ఏమీ లేదు. వీటిని లాభదాయకంగా నడిపించడంలో టాటా గ్రూప్ విఫలమైంది. ఎయిర్ ఏషియా ఇండియా 2020-21 సంవత్సరానికి 1,532 కోట్ల వార్షిక నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాడి అది 782 కోట్లుగా ఉంది. ఈ సంస్థ ఆదాయం సంవత్సరానికి 63 శాతం క్షీణించి 1,359 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో టాటా సన్స్ సారధ్యంలో ఎయిర్ ఇండియా నిర్వహణ ..కేంద్ర ప్రభుత్వ నిర్వహణకు తేడా ఏమిటన్ని ప్రశ్న.
ఏదేమైనా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ని నాశనం చేసే గొప్ప పనిని విజయవంతంగా పూర్తి చేశాయి. రాజకీయ పండితుల చేతిలో పడి పోటీలో నిలవలేకపోయాయి. ఇప్పుడు టాటాలు టేకోవర్ చేయటంతో ఏదో ఆశాకిరణంలా కనిపిస్తోంది. ప్రపంచంలో ఉత్తమమ డొమైన్ స్పెషలిస్టుల బృందాన్ని ఏర్పాటు చేసి తిరిగి ఎయిర్ ఇండియా గత వైభవాన్ని సంతరించుకుంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
మరోవైపు దీనికి భిన్నమైన అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ ఇండియా ఒక లాస్-మేకింగ్ ఎంటిటీ అయిన టాటా జేవీ ఎయిర్‌లైన్స్..భారీ నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను టేకోవర్ చేసింది. ప్రభుత్వం బ్యూరోక్రాట్లను ఎయిర్ ఇండియాని నడిపించడానికి అనుమతించింది. మరి టాటా సన్స్ ఇప్పుడు దానిని ఎవరి చేతిలో పెట్టనుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఎయిరిండియాలో ఉద్యోగులలో ఎవరి భయాలు వారికి ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కువ వయసు కలిగిన క్యాబిన్ సిబ్బందినే తీసుకుంటే ప్రైవేటీకరించిన ఎయిరిండియాలో ఎక్కువ సేపు పనిచేయాలంటే ఆందోళన చెందుతారు. ఖచ్చితంగా చెప్పాలంటే చాలా విదేశీ విమానయాన సంస్థలు యువత, అనుభవజ్ఞులైన సభ్యుల సమ్మేళనంగా ఉంటుంది.
కొత్త యజమాని చేతికి వెళ్లిన ఆరు నెలల్లోపు ఎయిర్ ఇండియా హౌసింగ్ కాలనీలను ఖాళీ చేయాలని ఉద్యోగులను కోరారు. వారి ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఏమైనా ఆందోళనలు ఉంటే దానిని ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం -CGHS ద్వారా ఆరోగ్య సంరక్షణ కంటిన్యూ అవుతుంది.
ఎయిరిండియాని ప్రైవేటీకరింకపోతే తమకు భవిష్యత్తు లేదని ఉద్యోగులు నమ్ముతున్నారు. కొనుగోలుకు ఎవరూ కొ ముందుకు రాని పక్షంలో సంస్థను మూసివేయవలసి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల గురించి ఆలోచించే యజమానులుగా టాటాలకు పేరుంది. తమను తీసివేయరని, వారి విమానయాన ప్రయాణంలో తామూ ఉంటామని ఉద్యోగులు గట్టిగా విశ్వసిస్తున్నారు.
ఇదిలావుంటే, ఎయిర్ ఇండియా ఉద్యోగులను ఏడాది పాటు టాటా గ్రూప్ కొనసాగించనుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా టేకోవర్ చేసిన తర్వాత రెండో ఏడాదిలో ఎయిర్ ఇండియా ఉద్యోగులను వీఆర్‌ఎస్ ద్వారా తొలగించేందుకు అనుమతించారు.
ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 12 వేల 85 మంది పని చేస్తున్నారు. వారిలో 8 వేల 84 మంది పర్మనెంట్ ఉద్యోగులు కాగా, 4 వేల ఒక్కరు కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో 1,434 మంది ఉద్యోగులు ఉన్నారు. ఐదేళ్ల పాటు ఎయిర్ ఇండియా బ్రాండ్, లోగో యధావిధిగా కొనసాగుతాయి.
మరోవైపు, ఎయిరిండియాను టాటా సన్స్ టేకోవర్ చేయటం పట్ల ఆ సంస్థకు చెందిన పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక వేళ టాటా కాకుండా మరే ఇతర కంపెనీ కొనుగోలు చేసినా వారు ఇలా స్పందిచేవారు కాదేమో. కానీ టాటాల చేతిలో తాము సురక్షితం అన్న భావన వారిలో కనిపిస్తోంది. ప్రైవేట్ సంస్థలన్నీ టాటాల మాదిరిగా ఉంటే ప్రైవేటీకరణను ఎవరూ వ్యతిరేకించరు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేయటం ఇక్కడ గమనార్హం!!
Dr.Ramesh Babu Bhonagiri