ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ రాష్ట్రంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కుల ప్రాతిపదికన ఏర్పడిన ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఓబీసీ, దళిత కమ్యూనిటీలకు అధికార బీజేపీ, విపక్ష ఎస్పీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి, గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను కులాలే నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఆ కుల పార్టీలలో కూడా చీలికల వర్గాలను మనం చూడవచ్చు. అంతిమంగా అందిరికి కావాల్సింది అధికారమే కదా. దాంతో,ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గాలి ఎటు వూపు వీస్తుందో జాగ్రత్తగా గమనిస్తున్నారు ఆయా పార్టీల నేతలు.
జనాభా పరంగా చూసినపుడు ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. ఇరవై కోట్లకు పైగా ప్రజలకు ఉత్తరప్రదేశ్ ఆవాసం. అధిక జనాభా కారణంగానే అక్కడ అధిక లోక్‌సభ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. వెనకబడిన తరగులు, దళితులు, బ్రాహ్మణలు, ఠాకూర్లు, జాట్ సామాజిక వర్గాలతో పాటు ముస్లింలు యూపీ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్నారు.
రాష్ట్ర జనాభాలో ఓబీసీలు దాదాపు సగ భాగం. ఐనా, ముప్పయ్ ఏళ్ల క్రితం వరకు పెద్దగా కుల రాజకీయాలు లేవు. మండల్ కమిషన్ సిఫార్సుల అమలుతో భారత రాజకీయాల్లోకి కుల రాజకీయం బలంగా ప్రవేశించింది. ఆ క్రమంలో ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ ఏర్పాటు చేశారు. దీని ప్రధాన ఓటు బ్యాంక్ ఓబీసీలలో బలమైన యాదవ కమ్యూనిటీ.
మరోవైపు, దేశ వ్యాప్తంగా దళిత నాయకత్వం బలోపేతమైంది. దానికి ఉత్తరప్రదేశ్ కేంద్ర స్థానంగా మారింది. 20 శాతం దళిత ఓట్లున్న ఈ రాష్ట్రంలో బీఎస్పీ సొతంగా అధికారంలోకి వచ్చింది. మొత్తం మీద గడచిన మూడు దశాబ్దాలలో ఈ రాష్ట్రంలో కులాలే రాజ్యమేలాయి. ఐతే, 2017 ఎన్నికలలో కులం స్థానంలో హిందుత్వకు ప్రజలు పట్టం కట్టారు.
ఉత్తరప్రదేశ్‌లో యాదవులు అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన ఓబీసీ కమ్యూనిటీ. యాదవ కులస్తులు రాష్ట్ర జనాభాలో 9-10 శాతం వరకు ఉంటారు. ఓబీసీ జనాభాలో వీరి షేర్ 20 శాతం. కుర్మీ, మౌర్య, కశ్యప్, నిషాద్, రాజ్‌భర్, బైండ్, సాహులు, ప్రజాపతి కులాలు యాదవ యేతర ఓబీసీలు గా పరిగణిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు యాదవులు కాని ఇతర వెనకబడిన తరగతులు. ఉత్తరప్రదేశ్ మొత్తం జనాభాలో వీరు కనీసం 35 శాతం వరకు ఉంటారు.
యాదవ్ కమ్యూనిటీ తరువాత కుర్మీలు రెండవ అత్యంత ప్రభావవంతమైన ఓబీసీ కులం. దాని తర్వాత రాజ్‌భర్లు ఉంటారు. రాష్ట్ర జనాభాలో కుర్మీ జనాభి 7 నుంచి 8 శాతం ఉంటుంది. తూర్పు యుపి లోని ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్, సోన్‌భద్ర, మీర్జాపూర్ ప్రాంత రాజకీయాలలో వీరు ముఖ్య భూమిక పోషిస్తారు. కుర్మి కమ్యూనిటీకి చెందిన డాక్టర్ సోనేలాల్ పటేల్ బీఎస్పీ నుంచి బయటకు వచ్చి 1995లో అప్నాదళ్ పార్టీని స్థాపించారు.
2009లో సోనేలాల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఆయన భార్య కృష్ణ పటేల్ పార్టీ అధ్యక్షులయ్యారు. 2014 ఎన్నికల్లో ఆమె కుమార్తె అనుప్రియ పటేల్ కాన్పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. తరువాత తల్లితో విభేధించి 2016లో అప్నాదళ్ (సోనేలాల్) పార్టీ పెట్టారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి 9 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఆమె తల్లి నాయకత్వంలోని అప్నాదళ్ సమాజ్ వాదీ పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య కుర్మి ఓట్లు ఏ మేరకు చీలుతాయన్నది రేపటి ఎన్నికలు తేల్చనున్నాయి.
మరోవైపు, బరేలీ, పిలిభిత్ జిల్లాల్లో గంగ్వార్‌ల ప్రభావం ఉంటుంది.సెంట్రల్, ఈస్ట్రర్న్ యుపిలో వెర్మాలు ఎక్కువగా ఉంటారు. పశ్చిమ యుపిలోని ఎటా, మయిన్‌పురి బెల్ట్‌లో లోధ్‌ల ప్రభావం ఉంటుంది. నిషాద్, మల్లాలు ప్రధానంగా ప్రయాగ్‌రాజ్, వారణాసి జాన్‌పూర్‌లో కనిపిస్తారు. ఈ చిన్న చిన్న ప్రాంతీయ గ్రూపులను 2017 ఎన్నికల్లో బీజేపీ దగ్గరకు తీసి సంఘటితం చేసింది. చిన్న పార్టీలే అయినా ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపాయి. బీజేపీ అఖండ విజయంలో కీలక భూమిక పోషించాయి. దాంతో ఈసారి అఖిలేష్ యాదవ్ ఆ ఓట్లను చెదరగొట్టే పనికి పూనుకున్నారు.అందులో భాగంగా ఇప్పటికే పలు ఓబీసీ నేతలను కలుపుకుపోతున్నారు. యాదవ యేతర ఓట్లు ఎంత చీలితో బీజేపీకి అంత దెబ్బని విశ్లేషకులు అంటున్నారు.
యాదవుల్లో ఎక్కువ మంది ఎస్పీతో ఉన్నారు. కుర్మీలు, మౌర్యులు బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. రాజభార్, నిషాద్, కశ్యప్, లోధ్, శాక్యా ఓటర్ల ప్రభావం కూడా చాలా నియోజకవర్గాల్లో ఉంటుంది. తూర్పు యుపిలో అనేక స్థానాలపై రాజ్‌భర్, నిషాద్‌ల ప్రభావం ఎన్నికల ఫలితాలను మార్చేస్తుంది. ప్రస్తుత గాలిని బట్టి ఈ కులాలు ఎస్పీ వైపు మొగ్గే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఐతే, అధికార బీజేపీ అంత సులభంగా వదిలిపెట్టదు.ఎస్పీ వైపు మళ్లకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది.
యూపీ జనాభాలో బ్రాహ్మణులు 12.65 శాతం ( 2.53 కోట్లు), జాతవులు 11.4 శాతం ( 2.28 కోట్లు), ఠాకూర్లు 10.55 శాతం (2.11 కోట్లు), యాదవ్ 8.60 శాతం (1.72 కోట్లు), కుర్మిలు 7 శాతం (1. 4 శాతం), బనియా 3.6 శాతం (72 లక్షలు)గా ఉంటారు. మొత్తంగా చూస్తే అగ్రవర్ణాలు 16 శాతం, ఓబీసీలు 44 శాతం, దళితులు 19 శాతం, ముస్లింలు 19 శాతం, ఇతరులు 2 శాతం వరకు ఉంటారు.
ఓబీసీలలో అనేక చిన్న కులాలు దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ నిరాదరణకు గురయ్యాయి. ఈ కులాల ఓటు శాతం 20 పైనే ఉంటుంది. 2017 ఎన్నికలలో బీజేపీ ఈ చిన్న గ్రూపులను కలుపుకుని లాభపడింది. ఈసారి వారు ఎటు వైపు ఉంటారో కచ్చితంగా తెలియదు. కానీ ఎటు వెళ్లినా వారే కింగ్ మేకర్లని విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.