పంజాబ్ ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుతోందా? అసెంబ్లీ ఎన్నికల ముందు కల్లోలానికి కుట్ర జరుగుతోందా..అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. అదే నిజమైతే రెండున్నర దశాబ్దాల పంజాబ్ శాంతి ప్రమాదంలో పడుతుంది. ఖలిస్తాన్ ఉద్యమం రగిలితే పరిస్థితి ఎలా వుంటుందో గత చరిత్ర చెబుతోంది.
రాష్ట్రంలో మళ్లీ ఉగ్ర అలజడికి ఖలిస్తాన్ ఉగ్రసంస్థలు ప్రయత్నించ వచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. డిసెంబర్ 23న జరిగిన లూథియానా పేలుళ్ల కేసులో సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)తో సంబంధం ఉన్న జస్వీందర్ సింగ్ ముల్తానీ జర్మనీలో అరెస్టయ్యాడు. పేలుళ్ల వెనుక యూకే, కెనడా, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే పలు ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్టు వెల్లడైంది. ఢిల్లీ, ముంబైలలో పేలుళ్లకు కూడా పథకం పన్నినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ముల్తానీ ఖలిస్తాన్ మద్దతుదారుడే కాదు ..పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఆయుధాలు.. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేసినట్లు తెలుస్తోంది. నిషేధిత సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్‌తో అతడికి సంబంధం ఉంది. ఆ సంస్థ చీఫ్ అవతార్ సింగ్ పన్నుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి రైతు ఉద్యమాన్ని నీరు గార్చటానికి కూడా ముల్తానీ ప్రయత్నించినట్టు వెల్లడైంది.
బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, ఆలిండియా సిఖ్ యూత్ ఫెడరేషన్ వంటి సంస్థలు కెనడా, యూకేలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ప్రత్యేక ఖలిస్తాన్ ఎజెండాతో దాదాపు పదమూడు ఉగ్ర సంస్థలు విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో సిఖ్ ఫర్ జస్టిస్ ఒకటి. ఇది సోషల్ మీడియా వేదికగా ఇది సిక్కు జాతీయ వాదం, వేర్పాటు వాద భావజాలాన్ని యువతలో నూరిపోస్తోంది. యువతీ యువకులకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు ఉసిగొలుపుతోంది. ఫలితంగా పంజాబ్‌లో మళ్లీ ఖలిస్తాన్ మాట గట్టిగా వినిపిస్తోంది. భింద్రన్‌వాలే బొమ్మలతో టీషర్స్ట్ మార్కెట్లో కనిపిస్తున్నాయి.
గత ఏడాది ప్రభుత్వం నలబై టెర్రర్ వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. అలాగే ఖలిస్తానీ తీవ్రవాదాన్ని నూరిపోసే పలు మొబైల్ అప్లికేషన్లను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. వాటిలో చాలా వరకు టెర్రరిస్టులు, టెర్రరిస్టు సంస్థలకు సంబంధించినవే. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాటి కార్యకలాపాలపై నిఘా పెట్టాయి. అంతేకాదు వాటి నిర్వాహకులను దేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నాయి.
సిక్కు ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) చీఫ్ వాధ్వా సింగ్ ఐఎస్‌ఐతో కలసి 40 ఏళ్లుగా భారత్ లో తీవ్రవవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. లూథియానా కోర్టు పేలుడుకు పంజాబ్‌లోని స్థానిక గ్యాంగ్‌స్టర్లను సింగ్ వాడుకున్నాడు. 1985లో ఎయిర్ ఇండియా విమానం పేల్చివేత బృందంలో ఇతడు సభ్యుడు. ఆ ఘటనలో 329 మంది చనిపోయారు. వారిలో 280 మంది కెనడా పౌరులు ఉన్నారు. 2004లో చండీగఢ్‌లోని బురైల్ జైలులో సొరంగం తవ్విన ఉగ్రవాదుల్లో ఇతనూ ఉన్నాడు. 2005లో న్యూ ఢిల్లీలోని లిబర్టీ , సత్యం సినిమా హాల్ పేలుళ్లలో అతడి హస్తం ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద భారతదేశం అతడిని టెర్రరిస్టుగా ప్రకటించి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
మరో మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను. అతడు ప్రస్తుత ఖలిస్తానీ తీవ్రవాద ముఖ్యులలో ఒకడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) నాయకుడు. గురుపత్వంత్ సింగ్ పన్ను దశాబ్దాలుగా భారతదేశంలో తీవ్రవాద ఎజెండాను అమలు చేస్తున్నాడు. మన నిఘా సంస్థల ప్రకారం పన్ను కెనడా, యూకె, యుఎస్‌లలో ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి మకాం న్యూయార్క్‌కు మారినట్టు సమాచారం. పంజాబ్‌లో యువకులతో టెర్రిరిస్టు రిక్రూట్‌మెంట్లు జరిపినట్టు అతనిపై అభియోగాలు ఉన్నాయి. ఖలిస్తాన్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఇతర ఖలిస్థానీ సంస్థలతో చురుకుగా టచ్‌లో ఉన్నాడు. హోం శాఖ అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
మరో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ప్రస్తుతం కెనడాలో ఉంటున్నాడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్. భారతదేశంలో పలు ఉగ్రవాద దాడుల్లో దీనికి హస్తం ఉంది. ఖలిస్థాన్ తీవ్రవాద సంస్థలలో ముఖ్యమైనది. పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌ను హత్య కేసులో జగ్తార్ సింగ్ తారను చండీగఢ్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో నిజ్జర్ దానికి నాయకుడయ్యాడు. జలంధర్ కు చెందిన నిజ్జర్.. సర్రే, కెనడా, యూకే నుంచి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అనేక తీవ్రవాద సంస్థల పునరుద్ధరణకు కృషి చేస్తున్నాడు. వాటికి నిధులు సమకూరుస్తున్నాడు. అతన్ని కెనడా ప్రభుత్వం అదుపులోకి తీసుకుని తరువాత విడుదల చేసింది. దేశానికి వ్యతిరేకంగా సిక్కులలో ద్వేష భావం పెంచే విధంగా నిజ్జర్ సోషల్ మీడియాలో నేరపూరిత ప్రకటనలు పోస్ట్ చేశాడు. వాటికి సంబంధించిన పోస్టులు ఫోటోలు, వీడియోలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. కెనడాలో ఉంటున్న నిజ్జర్‌పై కూడా రెడ్ కార్నర్ నోటీసు ఉంది.
మరో ఖలిస్తానీ తీవ్రవాది పరమ్ సింగ్ పమ్మాని ఇంటర్‌పోల్ నోటీసు ఆధారంగా పోర్చుగల్ ప్రభుత్వం అరెస్టు చేసింది. కానీ రెండు నెలల నిర్బంధం తరువాత అతడిని విడుదల చేసింది. 2007లో పాటియాలా పేలుళ్లు సహా పలు ఉగ్రదాడులలోపమ్మా ప్రమేయం ఉంది. అతడిని అప్పగించాలన్న భారతదేశ అభ్యర్థనను పోర్చుగల్ ప్రభుత్వం తిరస్కరించింది. 2009లో పాటియాలాలో జరిగిన రాష్ట్రీయ సిక్కు సగత్.. రుల్దా సింగ్ హత్యలో కూడా పమ్మా వాంటెడ్ గా ఉన్నాడు. 2010లో హోషియార్‌పూర్ జిల్లాలో స్థానిక డేరా అధినేత సంత్ ప్రధాన్ దాస్ హత్యలో అతడి హస్తం ఉంది. బబ్బర్ ఖల్సా నిధుల కోసం పమ్మా పాకిస్థాన్ కూడా వెళ్లి వచ్చాడు. నిరుడు మొహాలీలోని ఆయన ఇంటిపై దర్యాప్తు బృందం దాడి చేసి తల్లిదండ్రులను ప్రశ్నించింది. మరో టెర్రరిస్టు పన్నూతో కలిసి ప్రస్తుతం నిధుల సేకరిస్తున్నాడు. అందుకోసం తరచూ యూకే, కెనడాకు చక్కర్లు కొడుతుంటాడు.
లఖ్బీర్ సింగ్..నిషేధిత ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ ముఖ్య నాయకుడు. జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకి దగ్గరి బంధువు. కరడుగట్టిన ఉగ్రవాది. పలు ఉగ్రవాద కేసులలో ఇతనికి ప్రమేయం ఉంది. పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు సరిహద్దు ఆవల నుంచి భారత్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాల రవాణాలో చురుగ్గా పనిచేస్తున్నాడు. పంజాబ్ పోలీసులు స్థానికులను అరెస్టు చేసి, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పలు సందర్భాల్లో వారికి సింగ్‌తో పరిచయం ఉన్నట్టు వెల్లడైంది. వివిఐపిలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని భయాందోళనలకు సృష్టించేందుకు అతని కోసం పనిచేస్తున్నట్టు విచారణలో చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్న లఖ్బీర్‌పై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది.
గుర్జీందర్ సింగ్ పన్ను.. పంజాబ్‌లోని తారణ్ తరణ్ ఇతని సొంత ఊరు. యూకే కేంద్రంగా పనిచేసే ఖలిస్తాన్ ఉగ్రవాది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో కూడా ఇతడు ముఖ్యుడు. పన్నూ కెనడాలో యాక్టివ్‌గా ఉంటూ ఖల్సా మిలిటెంటట్లతో కలిసి పనిచేస్తున్నాడు. పంజాబ్ ఆర్‌ఎస్‌ఎస్ నేతల హత్యలలో ఇతని హస్తం ఉంది. పంజాబ్ ప్రభుత్వం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అందజేసిన మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఇతని పేరుంది. తన ఎజెండాను అమలు చేయడానికి పంజాబ్ నుండి యువకులను రిక్రూట్ చేస్తున్నాడు. ఇతడిపై యూఏపీఏ, ఐపీసీ, యుధాల చట్టం కింద అనేక కేసులు నమోదయ్యాయి.
విదేశాల నుంచి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడతున్న వీరి అరెస్టుకు భారత్ హోం శాఖ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఆయా దేశాలపై ఒత్తిడి పెంచి అరెస్టులు జరిగేలా చూడాలి.
ప్రస్తుతం కశ్మీర్ తీవ్రవాదులపై భారత్ ఉక్కుపాదం మోపటంతో పాకిస్తాన్ ఆటలు సాగటం లేదు. దాంతో ఐఎస్‌ఐ మరోసారి పంజాబ్‌పై పంజా విసరాలని చూస్తోంది. ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని రావణకాష్టంలా రగిలించాలని పన్నాగం పన్నుతోంది. పంజాబ్ మరో సారి ఉగ్రవాద కోరలకు చిక్కుకోకుండా సర్కార్ చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.