భారత్‌లో కరోనా సునామీ మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. బుధవారం 58000 కరోనా కేసులు నమోదు కావటం తీవ్రతను తెలియజేస్తోంది. గత తొమ్మిది రోజులతో పోలిస్తే కేసులు ఆరు రెట్లు పెరిగాయి. రాబోవు కాలంలో ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అంచనా వేయటం కూడా కష్టమే. మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు రెండు వేలకు దగ్గరయ్యాయి. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విదేశీ ప్రయాణికులలో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులే ఉంటున్నాయి.
థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు కట్టడి చర్యలు ముమ్మరం చేయాల్సిన సమయం వచ్చింది. రాబోవు పదిహేను రోజులు చాలా కీలకం. కేసులు భారీగా పెరుగుతుండటంతో పరీక్షలను కూడా పెంచాల్సి వుంది. అలాగే కరోనా సోకిన వారిని పర్యవేక్షించాలి. ఒమిక్రాన్, లక్షణాలు, తీవ్రత వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించాలి. వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరవచ్చని అంచనా. ఒమిక్రాన్ తీవ్రత తక్కువే అని అంటున్నా..ఆరోగ్య వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి దాని బారిన పడకుండా ఉండటానికే ప్రయత్నించాలి.
మరోవైపు, తెలుగు రాష్ట్రాలలో కూడా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో రోజువారీ కేసులు గత వారం రెండు వందలు ఉండేవి. సోమవారం 482 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఆ సంఖ్య 1,052కి చేరింది. ఈ లెక్కన రెండు మూడు రోజుల్లోనే పది వేల మార్క్ దాటినా ఆశ్చర్యం లేదు. మంగళవారం 434 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
తెలంగాణలో ఓమిక్రాన్ వ్యాప్తి ఈ నెల మూడవ వారం నాటికి గరిష్ట స్థాయికి చేరుతుందని అంచనా. అప్పుడు రోజువారీ కేసులు ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు ఉండవచ్చు. జనవరి చివరి నాటికి కేసులు తగ్గటం మొదలై ఫిబ్రవరి మూడవ వారం వరకల్లా అత్యల్ప స్థాయికి చేరుతాయని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు చెందిన సెంటర్ ఫర్ నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్ బృందం అంచనా వేశారు.ఇతర అధ్యయనాలు, నిపుణులు కూడా ఇంచు మించు ఇదే అంటున్నారు.
కరోనా ఉధృతి కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో హాస్పిటల్‌లో చేరేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వారికి రిజర్వ్ చేసిన పడకలు నిండిపోతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీలో సెకండ్ వేవ్ నాటి పరిస్థితి తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఢిల్లీ లోని లోక్‌నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్‌లో రెండు వేల కోవిడ్ పడకలకు గాను 45 మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఢిల్లీలోని దాదాపు అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితి ఇలాగే ఉంది అని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. గత రెండు మూడు రోజుల నుంచి నిత్యం 15 నుంచి 20 మంది వరకు కోవిడ్ బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు.
అయితే, డెల్టా నాటి పరిస్థితులతో పోలిస్తే ఒమిక్రాన్‌ను ఎదుర్కోవటంలో దేశం ఇప్పుడు ఎంతో సంసిద్ధతతో ఉంది. కోవిడ్‌కు సంబంధ మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఆక్సీజన్ కొరత లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. వైరస్ ఉధృతిని తగ్గించటంలో వ్యాక్సినేషన్ ప్రధాన భూమిక పోషిస్తుందని నిపుణులు పదేపదే చెపుతున్నారు. అధ్యయనాలు కూడా ఇదే అంటున్నాయి. అలాగే, కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటిస్తే థర్డ్ వేవ్‌ని సమర్థవంతంగా అదుపు చేయవచ్చు.
ఇది ఇలావుంటే, కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న తరుణంలో ఐసోలేషన్ మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. లక్షణాలు లేని వారు, లేదా స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు.. పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే 7 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొంది. ఆక్సిజన్ స్థాయిలు 93శాతం కంటే ఎక్కువ ఉండి, ఎలాంటి జ్వర లక్షణాలు లేకపోతే డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చు.
మరోవైపు, దేశంలో బుధవారం దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో 73 ఏళ్ల లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ అంతకంతకు వేగంగా వ్యాపిస్తోంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా వైరస్ బారినపడుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అమెరికాలో ప్రతి రోజు సగటున ఐదున్నర లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. అలాగే యూకేలో ప్రతి రోజులు రెండు లక్షల మందికి పైనే కరోనా సోకుతోంది. మరోవైపు, ఆస్పత్రులలో సిబ్బంది కొరత పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒమిక్రాన్ కష్టాల నుంచి గట్టెక్కటం ఎవరికైనా కష్టమే అనిపిస్తోంది!!