మన దేశంలోనే కాదు ..అమెరికాలో కూడా ధరలు మండిపోతున్నాయి. సరుకులను ముట్టుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటెమ్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో వినియోగదారులు మాంసం తినాలంటే భయపడుతున్నారు. దాంతో మటన్ షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. ఇదంతా కరోనా ఎఫెక్టే!!
హోల్ సేల్ మార్కెట్లో మేక మాంసం పౌండ్ పది డాలర్లు. పౌండ్ అంటే 453 గ్రాములు. అంటే అర్థకిలో మటన్ 740 రూపాయలు. కిలో అయితే దాదాపు పదిహేను వందలు. గతంలో పౌండ్ మేక మాంసం ధర ఎనిమిది డాలర్లు ఉండేది. ఒకే సారి రెండు డాలర్లు పెరిగింది. బీఫ్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. అది 5 నుంచి 6 డాలర్లకు పెరిగింది.
మన దేశంలో లాగే అమెరికాలో కూడా ధరలు పెరిగినప్పుడు వినియోగం తగ్గుతుంది. దాంతో కస్టమర్లను ఆకర్శించేందుకు దుకాణదారులు రేట్లు తగ్గిస్తారు. అమెరికాలో కూడా అదే జరుగుతోంది. ఐనా బిజినెస్ అంతగా సాగట్లేదంటున్నారు వ్యాపారులు.
కరోనా తీవ్రత తగ్గిన తరువాత అమెరికన్ మార్కెట్లు మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. కానీ ధరలు మునపటిలా లేవు. కార్ల నుంచి బట్టల వరకు ..ఉప్పు పప్పు వంటి అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయి. మరీ ముఖ్యంగా మాంసం ధరలు ఆకాశాన్నంటాయి. 2020 డిసెంబర్ నుంచి బీఫ్ ధరలు 14 శాతం పెరిగితే, పోర్క్ 12.1 శాతం, చికెన్ ధర 6.6 శాతం పెరిగింది.
కిరాణ ధరలు పెరుగుతుండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ధరల తగ్గుదలకు బైడెన్ సర్కార్ కసరత్తు చేస్తోందని వైట్‌హౌస్ వర్గాలు అంటున్నాయి. అసలు ఈ పరిస్థితి కారణం బడా సరఫరాదారులు. వారు సిండికేట్ అయి ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచారు. దాని ఎఫెక్ట్ వినియోగదారుల మీద పడింది. ఫలితంగా షాపు వారు నష్టపోతున్నారు.
మాంసం ప్రాసెసింగ్ రంగంలో ఉన్న పెద్ద సంస్థలకు పోటీ ఇవ్వడానికి, ధరలు కాస్త తగ్గించడానికి వీలుగా కొత్త సంస్థలకు అవకాశం ఇవ్వడానికి 50 కోట్ల డాలర్ల ఫెడరల్ రుణాలు అందిస్తామని అధ్యక్షుడు బైడెన్ గత జులైలోనే ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.
బైడెన్ ప్రభుత్వం ఫుడ్ సప్లై చెయిన్ బలోపేతానికి ప్రయత్నిస్తోంది. చిన్న ఉత్పత్తిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, రైతు మార్కెట్లు, సీఫుడ్ ప్రాసెసర్లకు అదనపు సాయం అందించనుంది. పశువుల ధరల్లో మరింత పారదర్శకత తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.
వాస్తవానికి అమెరికాలో ఈ పరిస్థితి కొత్త కాదు. సరిగ్గా 80 ఏళ్ల క్రితం.. 1921లో అప్పటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ‘పాకర్స్ అండ్ స్టాక్‌యార్డ్స్ చట్టం’ తీసుకొచ్చారు. అది ఇప్పటికీ అమలులో ఉంది. ధరలను నియంత్రించే పెద్ద సంస్థలకు ఆటకట్టించటమే దీని ఉద్దేశం. 1973లో మాంసం ధరలు ఆకాశాన్నంటడంతో ప్రెసిడెంట్ నిక్సన్ బీఫ్, మేక మాంసం ధరలకు కొన్ని కండిషన్స్ విధించారు. అయితే 1980 నుంచి ప్రాసెసింగ్ పరిశ్రమ బలోపేతం అవుతూ వచ్చింది. దాంతో, వేగంగా మారుతున్న ఆ పరిశ్రమ నియంత్రణ అధికారులకు కష్టతరమవుతోంది. అయితే ఇప్పడు అధిక ధరలు వినియోగదారులను ప్రభావితం చేయడంతో ఇది రాజకీయ అంశంగా మారింది. మరి బైడన్ వారి ఆట ఎలా కట్టిస్తారు..ధరలు ఎలా తగ్గిస్తారో చూడాలి!!