రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యే నేతలు కొందరు.. ప్రజలపై స్పష్టమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. భవిష్యత్ పై క్లియర్ అజెండాతో ముందుకు వెళ్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో.. 3 ప్రధాన పార్టీల్లో.. ముగ్గురు యువనేతలు ఇలాగే రాజకీయాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. రాబోయే తరానికి కాబోయే రాజకీయ సారథులం మేమే అన్నట్టుగా వారు తమ తమ పార్టీల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
అందులో టీఆర్ఎస్ ను గమనిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా.. మంత్రిగా గుర్తింపు తెచ్చుకుని.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు.. కేటీఆర్. ఓ దశలో.. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అని కూడా ప్రచారం జరిగితే.. వాటిని కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఖండించారు. కానీ.. వారి వ్యాఖ్యలు, ప్రస్తుతం పార్టీలో పరిణామాలు చూస్తుంటే.. కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా కేటీఆర్ ముందుకు పోతున్నారన్నది మాత్రం స్పష్టమవుతోంది.
ఇక.. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి శకం గురించి. పార్టీలో చేరగానే.. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. సీనియర్లతో పోటీని తట్టుకుని.. విమర్శలు ఎదుర్కొని.. పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగారు. వరస సభలతో పార్టీలో జోష్ నింపుతూనే.. శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంపొందిస్తున్నారు. రాను రాను పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా.. విస్తృతంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. సీనియర్లతో సైతం శభాష్ అనిపించుకునే పనిలో ఉన్నారు.. రేవంత్ రెడ్డి.
బీజేపీలో.. బండి సంజయ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి.. దూకుడుకు మారుపేరుగా నిలుస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించారు. అంతకుముందే దుబ్బాకలో గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు.. హుజూరాబాద్ పై దృష్టి పెట్టారు. తర్వాత లక్ష్యం.. అసెంబ్లీ ఎన్నికలే అన్నట్టుగా పాదయాత్రలో బిజీగా మారారు.
తెలంగాణలో ఈ మూడు ప్రధాన పార్టీలకు.. ఈ ముగ్గురు యువనేతలు.. ఆశాకిరణంగా నిలుస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు తారలుగా ఎదుగుతున్నారు.